కోడెల శివప్రసాద్ రూపం ఎంత గంభీరమో మనిషి కూడా అంతే గంభీరం. ఆయన మంత్రిగా ఉన్నపుడు కూడా పెద్దగా మాట్లాడిన సంఘటలు లేవు. తక్కువ మాటలు, ఎక్కువ చేతలు ఇదే ఆయన విధానంగా చెబుతారు. కోడెలకు డాక్టర్ గా ఎంతో పేరుంది. సర్జన్ గా ఆయన హస్తవాసి మంచిది అంటారు. అటువంటి కోడెల రాజకీయాల్లోకి రావడంతో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన రాజకీయమంతా వివాదాలతోనే సాగిందని చెప్పాలి.


ఆయన హోం మంత్రిగా ఉన్నపుడే వంగవీటి రంగా మర్డర్ జరిగింది. దానికి  ఓ వర్గం ప్లాన్ చేస్తే రంగా మర్డర్ జరిగిందని అంటారు. ఇక ఆ సామాజికవర్గానికే చెందిన హోం మంత్రిగా ఉండడంతో అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కోడెల నాటి ఘటనలకు బాధ్యత వహించి హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీకాకుళానికి చెందిన కిమిడి కళా వెంకటరావు హోం మంత్రి అయ్యారు. మరో సందర్భంలో కోడెల ఇంట్లో బాంబులు పేలాయని ప్రచారం జరిగింది. కోడెల వర్గ రాజకీయాలను ప్రోత్సహించారని కూడా బాగా వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో కూడా కోడెల ఎక్కడా చలించకుండా అడుగులు ముందుకు వేశారు. ప్రతీసారి వివాదాలు ఆయన్ని ముందుకే సాగేలా చేశాయి తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు.


ఇక కోడెల స్పీకర్ గా ఉన్నపుడు కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరిక సందర్భంగా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి నాడు కూడా కోడెల ధైర్యంగానే తనపైన వచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్నారు.  అంతెందుకు కోడెల తాజా ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ వద్ద పడిపోయిన ఘటనలో కూడా వెంటనే సర్దుకుని తనదైన రాజకీయం చూపించారు తప్ప అధైర్యపడలేదు. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నాలుగు నెలలైంది. కోడెల మీద ఎన్నో  ఆరోపణలు వచ్చాయి. అయితే కేసులు మాత్రం ఆయన కుమారుడి మీదనే ఉన్నాయి.




ఇంతలా జరిగినా కూడా కోడెల ఎక్కడా ధైర్యం కోల్పోలేదు.  ఎందుకంటే కోడెలకు ప్రతీ సందర్భంలోనూ పార్టీ అండగా ఉండేది. కానీ గత నాలుగు నెలల పరిణామాలు చూసుకుంటే మాత్రం పార్టీ ఆయన్ని పక్కన పెట్టిందనే చెప్పాలి. కోడెల ఆ మధ్యన ఆసుపత్రి పాలు అయితే టీడీపీ నేతలెవరూ సరిగ్గా స్పందించలేదన్న ఆవేదన ఆయన అనుచరుల్లో ఉందంటారు. ఇక వ్యక్తిగతంగా కూడా కొడేల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని, కుటుంబంలో కూడా కలతలు ఉన్నాయని అంటారు.



ఏది ఎలా ఉన్నా కొడెల పులి లాంటి వారు, మరి ఆయన్ని పిల్లిగా మార్చిన పరిస్థితులేంటి అని చూస్తే మాత్రం ఆయన రాజకీయంగా ఒంటరి అయ్యారన్న బాధ మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగానే ఆయన జీవితం నుంచి తప్పుకోవాలని భావించారేమోనని అంటున్నారు. ఏది ఏమైన కోడెలకు రాజకీయంగా అండ కరవైన పరిస్థితులే పిల్లిని చేశాయా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: