తెలుగు దేశం  పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని తెలుగు తమ్ముళ్లకు ఆయన సూచించారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని శ్రీకాంత్ స్పష్టం చేశారు.  అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు చంద్రబాబుకు ఈ విషయంలో ఏ మాత్రమన్న బాధ ఉందా అని నిలదీశారు.   



నిజానిజాలు పోస్టుమార్టం నివేదిక వెల్లడిస్తుందన్నారు. ఇదిలా ఉండగా శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోడెల మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే  కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌ పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో  కోడెల  మరణం పట్ల ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని కోడెల కుమారుడు శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. శివప్రసాద్‌ను శివరామే హత్య చేశాడన్నారు.  దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శివరామే ఆస్తి కోసం ఈ హత్య చేశాడని ఆయన ఆరోపించారు.





ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్‌ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్‌ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్‌ నాకు పలుమార్లు ఫోన్‌ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్‌ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్‌కు ఫోన్‌ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించిన సందర్భాలు అనేకమున్నాయని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: