కొన్ని సందర్భాలలో కరెంటు బిల్లులు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. రీడింగ్ నమోదులో పొరపాటు వలనో, కరెంట్ మీటర్లో సాంకేతిక సమస్యల వలనో భారీగా బిల్లులు వస్తున్నాయి. వాడుకోకపోయినా ఇంత బిల్లు వచ్చిందేంటి అని ఆశ్చర్యపోవటం వినియోగదారుల వంతవుతుంది. గోదావరిఖని ప్రాంతంలో ఒక చిన్న రేకుల షెడ్డుకు 6 లక్షల రుపాయల కరెంట్ బిల్లు నెల రోజులకు వచ్చింది. 
 
రాజయ్య అనే వ్యక్తి ఆ రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆ రేకుల షెడ్డుకు ప్రతి నెల వందల్లోనే బిల్లు వచ్చేది. కానీ ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు మాత్రం 6 లక్షల 8 వేల రుపాయలు వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని సంజయ్ నగర్ కు చెందిన మాస రాజయ్య కరెంట్ బిల్లును చూసి షాక్ అయ్యాడు. వెంటనే కరెంట్ బిల్లుతో సంబంధిత అధికారుల్ని ఈ విషయం గురించి సంప్రదించాడు. 
 
సంబంధిత అధికారులు సమస్య గురించి చెప్పినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు కనీసం రేకుల షెడ్డుకు ఇంత భారీగా బిల్లు ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయటం లేదని రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత అధికారులు ఈ విషయం గురించి వెంటనే స్పందించి కరెంట్ వాస్తవ బిల్లును ఇవ్వాలని రాజయ్య కోరుతున్నాడు. 
 
గతంలో సంగారెడ్డి జిల్లాలో పూరి గుడిసెకు 90 వేల రుపాయల కరెంట్ బిల్లు రావటంతో బాబూమియా అనే వ్యక్తి తీవ్ర ఆందోళన చెంది మరణించాడు. ఆ తరువాత విద్యుత్ శాఖ అధికారులు సాంకేతిక లోపం వలన బిల్లు పెద్ద మొత్తంలో వచ్చిందని పేర్కొనటం జరిగింది. ఈ సంవత్సరం జూన్ నెలలో ఖమ్మం జిల్లాలో వెంకటప్పయ్య అనే ప్రభుత్వ ఉద్యోగికి 4 లక్షల 78 వేల రుపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ ఘటనలో అధికారులు రీడింగ్ తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: