అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబునాయుడు పెట్టింది పేరు. తాను అధికారంలో ఉంటే ఒకలాగ వ్యవహరించే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోలా వ్యవహరిస్తారన్న విషయం చాలా సార్లు రుజువైంది. తాజాగా చేసిన ఓ డిమాండ్ తో చంద్రబాబు అపరిచితుడిలా మారిపోయారు. అపరిచితుడు సినిమాలో హీరో లాగ, చంద్రముఖి సినిమాలో హీరోయిన్ లాగ ఎప్పడికప్పుడు మారిపోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఆత్మహత్య (హత్య ?) చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై సిబిఐ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తాను సిఎంగా ఉన్నంత కాలం చంద్రబాబు రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీని నిషేధించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు సిబిఐ ఎంట్రిని ఎందుకు నిషేధించారంటే టిడిపి నేతలపై, ప్రజాధనాన్ని దిగమింగిన వారిపై సిబిఐ దాడులు చేయటాన్ని సహించలేక పోయారు.

 

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సిఎం రమేష్, పాలేటి రామారావు, బీద మస్తాన్ రావు లాంటి అనేక మంది టిడిపి నేతలపై వచ్చిన ఫిర్యాదుల వల్ల సిబిఐ దాడులు జరిపింది. దాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు సిబిఐ ఎంట్రిని రాష్ట్రంలోకి బ్యాన్ చేశారు. అప్పట్లో ఎంత దుమారం రేగినా చంద్రబాబు లెక్క చేయలేదు.

 

 సరే మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిబిఐ ఎంట్రికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత టిడిపి మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని జగన్ నిర్ణయించారు.

 

ఈ నేపధ్యంలోనే మాజీ స్పీకర్ కోడెల మరణించటం సంచలనంగా మారింది. కోడల మృతిపై చంద్రబాబు మాట్లాడుతూ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. సిబిఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్ధులను వేధించటానికి ఉపయోగించుకుంటోందని ఆరోపణలు చేసిన చంద్రబాబు మరి కోడెల మృతిపైన మాత్రం సిబిఐ విచారణను ఎలా డిమాండ్ చేస్తున్నారు ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: