చంద్రబాబు ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు ఓ మాట అనేవారు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. అది అప్పట్లో అధికారుల గురించి బాబు తరచూ వాడే మాట. పదేళ్ల పాటు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత బాబుకు తన ఓటమికి కారణం తెలిసింది. అందువల్ల ఆయన నవ్యాంధ్రకు సీఎం గా  వచ్చాక ఆ మాట మాత్రం వాడడం మానేశారు. ఇక చంద్రబాబు ఇపుడు దాన్ని రాజకీయాల్లోకి మార్చేసి  బాగా వాడేసుకుంటున్నారు. నేను రాజకీయాల్లో నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ వైసీపీకి తొడకొడుతున్నారు.



ఈ కారణంగా ఇపుడు వైరి పక్షాలు కూడా బాబు మాటలకు రియాక్ట్ కవాల్సివస్తోంది. బాబు రాజకీయానికి ప్రతి రాజకీయం చేయాల్సివస్తోంది. నిజానికి సార్వత్రిక ఎన్నికలు అయి నాలుగు నెలలు మాత్రమే గడిచాయి. గెలిచిన పార్టీ కాస్త రిలాక్స్ మూడ్ లో ఉంటే ఓడిన పార్టీ కొన్నాళ్ళు సైలెంట్ అవుతుంది. ఇది సహజ పరిణామం. కానీ ఏపీలో మాత్రం బాబు ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీ చరిత్రలో గతంలో పోలిస్తే  దారుణమైన ఫలితాలు వచ్చాయి. దాంతో సౌండ్ అసలు ఉండదని అంతా అనుకున్న వేళ వారం తిరగకుండానే చంద్రబాబు విమర్శలు అందుకున్నారు. వంద రోజులు గడిచేస‌రికి అది పతాకస్థాయికి చేరుకుంది. ఇపుడు చూస్తే ఎన్నికల ముందు ఎలాంటి వాతావరణం ఉందో అంతే వేడిగా ఉంది. 


సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో మళ్లీ ఏపీ పొలిటికల్ హీట్ ఓ రేంజిలో ఉంది. బాబు ఇలా మొదలెట్టేశాక వైసీపీ కూడా వూరుకోలేదుగా నెమ్మదిగా ప్రారభించి ఇపుడు ఢీ అంటే ఢీ అనే స్థాయికి రెండు వైపులా మాటల తూటాలు పేలుతున్నాయి. నిజానికి జగన్ గెలిచేశాడు, సీఎం అయిపోయాడు, ఇంక ఫరవాలేదంటూ ఇన్నాళ్ళు రాజకీయంగా అంత దూకుడు ప్రదర్శించని నాయకులంతా ఇపుడు మళ్ళీ బయటకు రావాల్సివచ్చింది. జగన్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని మార్కులు తగ్గించినా కూడా మంత్రుల్లో చురుకు పుట్టలేదు, ఇపుడు మాత్రం బాబు టార్గెట్ గా అంతా ఒక్కటిగా కదులుతున్నారు.


ఇక మరో వైపు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ సర్కార్ కి మద్దతుగా పెద్ద నోరు చేస్తుకుంటూ బాబుకు గట్టి సవాళ్ళే విసురుతున్నారు. ఇంకో వైపు మాజీ మంత్రులు, సీనియర్ నేతలైన దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య వంటి వారు బాబు పై విమర్శలతో దాడి చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే తన పార్టీని రీచార్జ్ చేయాలనుకుని బాబు వైసీపీ మీద యుధ్ధం ప్రకటిస్తే ఇపుడు వైసీపీ బాగా యాక్టివ్ అవుతోంది. మరి ముందున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఇప్పటి నుంచే రెడీ కావడానికి ఇది ఉపయోగపడితే మాత్రం బాబు దెబ్బతినాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: