సెప్టెంబర్ 17 నిరంకుశ పాలనకు సంకెళ్లు తెంపిన రోజు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. 1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆ సంతోషం లేకుండా పోయింది. బ్రిటిష్ ప్రభుత్వానికి సామంతుడిగా ఉన్న మీర్ ఉస్మాన్ ఖాన్ అనే నవాబు తాను స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. 
 
హైదరాబాద్ లోని ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకున్నప్పటికీ హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని నవాబు ప్రకటించాడు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రజాకార్లు గ్రామాలపై పడి దోచుకొని హత్యాకాండను కొనసాగించారు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లాభాయి పటేల్ హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న దురాగతాలు చూసి చర్యలు తీసుకోక తప్పదని నిర్ణయం తీసుకున్నాడు. 1948 సెప్టెంబర్ 13 వ తేదీన భారతదేశం సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. 
 
జరిగిన పరిణామాలతో నిజాం నవాబు సెప్టెంబర్ 17 వ తేదీన లొంగుబాటు ప్రకటన చేశాడు. ఆ ప్రకటనతో హైదరాబాద్ కు స్వాతంత్ర్యం లభించింది. అప్పటినుండి సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన దినంగా పాటిస్తారు. 1948 సెప్టెంబర్ 17 వ తేదీన వేలాదిగా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. 
 
ఆ తరువాత దేశంలో జరిగిన తొలి ఎన్నికలలో 1952 వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది. 1956లో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న భూభాగాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగానే నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం టీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: