నరేంద్ర మోదీ ఈ పేరు ఇప్పుడు దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు..మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఇప్పుడు నమో మోదీ అంటున్నారు.  భారత ప్రధానిగా నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్న మార్పులు తీసుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు.   సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు.  నరేంద్ర మోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.

1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. తల్లి తండ్రులు శ్రీమతి హీరాబా మోదీ, శ్రీ దామోద‌ర్ దాస్ మోదీ. వీరికి ఆరుగురు సంతానం. అందులో మూడ‌వ వారు శ్రీ న‌రేంద్ర మోదీ. వాద్ న‌గ‌ర్ చిన్న ప‌ట్ట‌ణ‌మే అయినా దానికి ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంది.   గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 

న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు.. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన కుటుంబం కావ‌డంతో జీవితం గ‌డ‌వ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండే వారు ( సుమారు 40 అడుగుల పొడ‌వు, 20 అడుగుల వెడ‌ల్పు గ‌ల ఇల్లు వీరిది). మోదీ తండ్రి  స్థానిక రైల్వే స్టేష‌న్‌లో ఏర్పాటు చేసుకొన్న‌ టీ స్టాల్‌లో టీ ని విక్ర‌యించే వారు. చిన్న‌ప్పుడు నరేంద్ర మోదీ త‌న తండ్రి ఏర్పాటు చేసిన టీ స్టాల్‌లో ఆయ‌న‌కు సహాయ‌ప‌డుతూ ఉండే వారు.   బాల్యం లో తాను గ‌డిపిన జీవితం శ్రీ న‌రేంద్ర మోదీపై గాఢ‌మైన ముద్ర‌ను వేసింది. 

 న‌రేంద్ర మోదీ త‌న తండ్రికి స‌హాయ‌ప‌డుతూనే చ‌దువును ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. తండ్రికి స‌హాయ‌ప‌డ‌డం, చ‌దువు తో పాటు ఇత‌ర కార్య‌క‌లాపాల‌ను కూడా చురుకుగా చేసేవారు. చ‌దువు, వ‌క్తృత్వం ప‌ట్ల ఆస‌క్తి, దేనినైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌గ‌ల వ్య‌క్తిగా  న‌రేంద్ర మోదీని ఆయ‌న చిన్న‌నాటి మిత్రులు గుర్తు చేసుకుంటారు. పాఠ‌శాల గ్రంథాల‌యంలో గంట‌ల‌కొద్తీ పుస్త‌కాలు చ‌దువుతూ ఉండేవారు. ఇక క్రీడ‌ల లోనూ వారికి ఎంతో ఆస‌క్తి. ఈత అంటే వారికి మ‌క్కువ‌.  ఆయ‌న‌కు ఇరుగు పొరుగున ఎంతో మంది ముస్లిం మిత్రులు ఉండే వారు.

అందువ‌ల్ల త‌ర‌చుగా హిందూ, ముస్లిముల పండుగ‌లను జ‌రుపుకొనే వారు.  ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.

ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.  2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో మరల గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: