కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబునాయుడు మీద కేసు పెట్టాలంటూ మంత్రి కొడాలి నాని కెసియార్ ను  డిమాండ్ చేశారు. కోడెల ఆత్మహత్యపై కొడాలి మీడియా మాట్లాడుతూ చంద్రబాబుపై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. కోడెల మృతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కొడాలి స్పష్టం చేశారు.  

 

కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. నిజానికి కోడెలపై ప్రభుత్వం కేసు పెట్టలేదని చెప్పారు. అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో కూడా పోలీసులు కేసు పెట్టారేగాని విచారణకు కూడా కోడెలను పిలవలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కొడుకు, కూతురు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారు కానీ ఎవరినీ విచారణకు పిలవలేదు, అరెస్టులు చేయలేదని గుర్తు చేశారు.

 

అధికారంలో ఉన్నపుడు కోడెలతో దురాగతాలన్నింటినీ చేయించింది చంద్రబాబు, నారా లోకేషే అంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నపుడు తాను చేసిన పనులకే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోడెల పర్యవసానాలను అనుభవిస్తున్నట్లు కొడాలి అభిప్రాయపడ్డారు.  ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోడెలకు చంద్రబాబు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

 

కోడెలపై చంద్రబాబుకు నిజంగానే ప్రేమ ఉన్న వ్యక్తి అయితే వైసిపి ప్రభుత్వం కోడెలను వేధిస్తోందని చంద్రబాబు ఒక్కసారి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదని నిలదీశారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నది చంద్రబాబు వల్లే అంటూ కొడాలి అభిప్రాయపడ్డారు. కోడెల మరణం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలంటే ముందు ఆయన మొబైల్ కాల్ డేటాను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.

 

కోడెల మరణం మిస్టరీని తెలంగాణా పోలీసులు చేదించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన విచారణను కెసియార్ నిష్పక్షపాతంగా జరిపించాలని కూడా సూచించారు. పల్నాడులో వైసిపి బాధితులతో శిబిరం పెట్టిన చంద్రబాబు ఒక్కసారి కూడా కోడెలను అక్కడికి రానీయలేదంటూ నిలదీశారు. అవసరానికి వాడుకుని వదిలేయటమే చంద్రబాబు నైజం అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కష్టాల్లో ఉన్న తనను చంద్రబాబు, పార్టీ నేతలు వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న మనస్ధాపంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు కోడెల తేల్చేశారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: