వి.హనుమంతరావు :
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంతరావు కూడా కోడెల మృతి పట్ల విస్మయానికి గురయ్యారు. ఏపీ రాజకీయాల్లో తనకు పరిచయం లేని వారంటూ ఎవరూ లేరని, అందునా కోడెల స్పీకర్ గా, మంత్రిగా పనిచేయడంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కోడెల ఉరివేసుకుని చనిపోయారంటున్నారని, మరి కుటుంబ కలహాలా, లేక రాజకీయ కక్షలా అనేవి తెలియడంలేదని అన్నారు.అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఉరివేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎవరైనా సామాన్యుడు ఉరివేసుకున్నాడంటే అప్పుల బాధతోనో, కుటుంబ సమస్యలతోనే చనిపోయాడని అనుకోవచ్చని, కానీ కోడెల వంటి మంచి వ్యక్తికి ఉరివేసుకోవాల్సిన అవసరం ఏంటని అని సందేహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దవాడికే ఇలాంటి ఆలోచన వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏంటన్నదే తన పాయింట్ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడు:నిబద్ధత కలిగిన నేతను కోల్పోయామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని, కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని, టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సూచించారు. 
నారా లోకేశ్:ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ గారి మరణం పార్టీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కోడెల శివప్రసాద్ గారు ఎల్లప్పుడూ ప్రజాసేవే పరమావధిగా వ్యవహరించేవారని, టీడీపీని పటిష్టం చేసేందుకు నిర్విరామంగా శ్రమించారని లోకేశ్ కీర్తించారు. 
సోమిరెడ్డి:కోడెల శివప్రసాద రావు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడెల మృతిపై సానుభూతి తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

సీఎం జగన్:విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా వ్యవహరించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కోడెల మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన జగన్ సంతాపం ప్రకటించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు:ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కోడెల మృతి విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. 

చంద్రబాబు:సుదీర్ఘకాలం తనతో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన కోడెల శివప్రసాదరావు మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడెల చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ పొందారని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ ట్వీట్ చేశారు.

 
 


మరింత సమాచారం తెలుసుకోండి: