మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవ్మరణానికి  ప్రత్యక్షంగా.. పరోక్షంగా కారణం అయింది చంద్రబాబేనని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు మానసికంగా వేధించటం వల్లే కోడెల చనిపోయారని ఆరోపించారు. ఆయనపై ఏ1గా కేసు చేయాలని తెలంగాణ సర్కారు ను కోరుతున్నానన్నారు.


అంతేందుకు వర్ల రామయ్యతో కోడెలపై ఆరోపణలు చేయించింది  చంద్రబాబు కాదా అని కొడాలి నాని ప్రశ్నించారు. అసలు చెప్పాలంటే  కోడెలతో తప్పులు చేయించింది చంద్రబాబేనని స్పష్టం చేశారు.  మంగళవారం  అమరావతిలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. ఈ మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం  కోడెలను వేధిస్తుందని..అక్రమ కేసులు పెడుతుందని నువ్వు ఒక్కసారి అన్నా మాట్లాడవా అని సూటిగా ప్రశ్నించారు.  పల్నాడు బాధితులతో శిబిరాలను ఏర్పాటు చేశారు కదా. మరి  కోడెల బాధితుడు అయితే ఆ శిబిరాల్లోకి ఆయన ఎందుకు రాలేదని నిలదీశారు.


తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టీ రామారావు శవయాత్రలో చంద్రబాబుపై చెప్పులు విసిరిన సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కోడెల విషయంలో వ్యవహరించినట్టే అప్పట్లో ఎన్టీఆర్ పట్ల కూడా దుర్మార్గమైన వైఖరిని అవలంభించారని దుయ్యబట్టారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామను ఒక పద్దతి ప్రకారం దుష్ప్రచారం ప్రచారం చేశారని మండిపడ్డారు.  ఆయన్ను పదవి నుంచి దించి ఆయన చావుకు కారణం అయిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. చనిపోయాక సింహం దగ్గర కూర్చుని దొంగ  ఏడ్పులు ఏడ్చి మహానుభావుడు అంటూ శవయాత్రలో పాల్గొన్న వ్యక్తి చంద్రబాబు. హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినా ..సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు కోడెల విషయంలో కూడా చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు.


పల్నాడు ప్రజలు దాడి చేస్తే ఆ నింద మా మీద  వేయడం తగదన్నారు. పార్టీ మీటింగ్ లకు వస్తానన్నా వద్దని అవమానించింది నువ్వు కాదా?. కాపాడాల్సిన తండ్రి స్థానంలో ఉన్న నువ్వు వదిలించుకోవటానికి ప్రయత్నించింది నువ్వు.. ఆయన మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే ఆయనే వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించావు. ఆయన తరపున ఏ నాయకుడు అయినా మాట్లాడాడా? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చర్చలు జరిపావు. ఆయన్ను సస్పెండ్ చేస్తే నీ నక్క జిత్తుల బతుకు అంతా తెలుసు కాబట్టి భయపడి వదిలేశావు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ లిస్టు ను పరిశీలించాలన్నారు. చంద్రబాబు నీచమైన ఆలోచనలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. 


కోడెల సూసైడ్ నోట్ ఉందేమో అని పిల్లిలాగా భయపడ్డాడు. బతికుండగా కోడెలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వని నువ్వు..చనిపోయాక శవాన్ని వేసుకుని రాజకీయం చేస్తున్నావు. చంద్రబాబు మేనేజ్ చేయలేని వ్యక్తులకే తెలంగాణ సర్కారు  విచారణ బాధ్యతలు అప్పగించి కేసు నిష్పాక్షికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. కోడెల కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: