ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు  టీటీడీ పాలకమండలిని  ఖరారు చేసింది. టీటీడీ చైర్మ‌న్‌గా మాజీ ఎంపీ, ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బంధువు వైవీ సుబ్బారెడ్డిని గ‌తంలోనే నియ‌మించారు. చైర్మ‌న్‌గా నియ‌మితులైన సుబ్భారెడ్డి ఇంత‌కాలం ఒక్క‌డే త‌న‌దైన శైలీలో నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం  మొత్తం 24 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేశారు. పాల‌క‌మండ‌లిలో  ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురుకి అవకాశం కల్పించారు.


ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు... యూవీ రమణమూర్తి, మల్లిఖార్జున రెడ్డి, గొల్ల బాబురావు, కె. పార్ధసారధి రెడ్డిలను బోర్డు సభ్యులుగా నియమించారు. వీరితో పాటు వి.పార్ధసారథి, నాదెండ్ల సుబ్బారావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, డీపీ అంతాలను పాల‌క‌మండ‌లి బోర్డులోకి తీసుకున్నారు. తెలంగాణ కోటాలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జూప‌ల్లి రామేశ్వరరావు, బి. పార్ధసారథిరెడ్డి, యు. వెంకట భాస్కర రావు, మూరంశెట్టి రాములు, డి. దామోదర్ రావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు.


ఢిల్లీ కోటాలో ఎంఎస్ శివ శంకర్‌ను పాలకమండలిలోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, సంపత్ రవి నారాయణతో పాటు ఇన్ఫోసిస్ సుధానారాయణ మూర్తిలను పాలకమండలి సభ్యులుగా నియమించారు. మహారాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మను టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు. అయితే టీటీడీ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలిగా నియమితులైన సుధా నారాయ‌ణ మూర్తి గ‌త టీడీపీ పాల‌న‌లో కూడా మండ‌లి స‌భ్యురాలిగా ప‌నిచేశారు. అయితే కేవ‌లం సుధా నారాయ‌ణ మూర్తికి మాత్ర‌మే మ‌రోమారు అవ‌కాశం రావ‌డం విశేషం. 


మొత్తంగా చూస్తే ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి ఛాన్స్ ఇచ్చారు. ఇక త‌మిళ‌నాడు నుంచి న‌లుగురికి, క‌ర్నాక‌ట నుంచి ముగ్గురికి, మ‌హారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్క‌రికి చోటు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: