దట్టమైన  అడవులకు కేరాఫ్ అయిన ఆదిలాబాద్ జిల్లాలో కంచే చేను మేస్తోంది. విలువైన టేకు కలపను రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కలప అక్రమ రవాణా చేసేది స్మగ్లర్లా?... అధికారులా అంటే అక్కడక్కడ అధికారులే అనే పేరు వినిపిస్తోంది. ప్రత్యక్షంగా కొంతమంది కలప తరలిస్తుంటే.. మరికొందరు పరోక్షంగా సహకరిస్తున్నారు. అటు కలప, ఇటు వేటగాళ్లకు అండగా ఉంటున్నారు ఇంటి దొంగలు. 


ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవీ శాఖలో ఇంటికి కన్నం వేసే అధికారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అడవిని  రక్షించాల్సినవారే స్మగ్లింగ్‌కు సహకరించడంతో అరణ్యం అంతా పలుచబడుతోంది. అటవీశాఖ మంత్రి సొంత  జిల్లాలో కలప స్మగ్లింగ్ కలకలం రేపుతోంది. అన్ని డివిజన్లలో అవినీతి అధికారుల ఆటకట్టిస్తున్నారు అటవీశాఖ ఉన్నతాధికారులు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ డివిజన్ పరిధిలో బీర్సాయిపేట్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ పారెస్ట్ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న కవ్వాల్ టైగర్‌ జోన్‌లో నిబంధనలను కఠినం చేశారు. చుట్టుపక్కల గ్రామస్థులు పశువులకు గ్రాసం, వంట చెరుకు తీసుకోవడాన్ని కూడా అటవీ శాఖ అధికారులు నిషేధించారు. కానీ అటవీ అధికారులే నియమ నిబంధనలు పాటించకుండా స్మగ్లర్లతో కుమ్మక్కై అక్రమంగా కలపను తరలించడంలో సహకరిస్తున్నారు. ఈ వ్యవహారం చాలారోజులుగా జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలంటున్నారు. మామూళ్ల మత్తులో పడి అటవీ సంపదను కొల్లగొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 


ఈ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులకు తెలియకుండా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అధిక మొత్తంలో అక్రమ కలప పట్టుకున్నారు. వారం రోజుల వ్యవధిలో సిరికొండ మండల కేంద్రంలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి రేంజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి కలప పట్టుకున్నారు. మరో రెండు రోజుల తేడాలో ఉట్నూర్ మండల  కేంద్రం సుభాష్ నగర్ లో కూడా డి.ఎఫ్.ఒ ఆదేశాలతో దాడులుచేసి ఎలాంటి పర్మిట్లు లేకుండానే కలప తరలిస్తున్నట్లు గుర్తించారు. గృహనిర్మాణం కోసం ఉపయోగించే చెక్కలు దొరికాయి. వీటి స్మగ్లింగ్ వెనుక అధికారుల హస్తం ఉన్నట్లు  అనుమానాలు వ్యక్తమయ్యాయి. 


కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కనీసం కొమ్మ కూడా తీయకూడదు. పడిపోయిన చెట్టును సైతం ముట్టుకోవడానికి వీలులేదు. అయితే .. రోజురోజుకి అడవి మాత్రం తగ్గిపోతుంది. దీని వెనుక అక్రమ రవాణానే ప్రధాన కారణం. అధికారుల సపోర్ట్ తోనే ఈ స్మగ్లింగ్ సాగుతున్నట్టు ఆరోపణలున్నాయి.  నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగపూర్ సెక్షన్ అధికారి ప్రభాకర్, దత్తోజిపేట్ సెక్షన్ అధికారి అమీర్ అలీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించడంతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగుడా బీట్ పరిధిలో ఈ నెల 3న పట్టుబడిన అక్రమ టేకు కలప విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవీ శాఖలోని ఇంటిదొంగలపై వేటు పడుతోంది. ఇన్నిరోజుల తర్వాత  స్మగ్లర్లపై దృష్టిసారించిన ప్రభుత్వం ఇంటిదొంగల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: