దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయాల‌కు ప‌త్రిక‌ల‌కు ఎన‌లేని సంబంధ బాంధ‌వ్యాలు పెరిగిపోతున్నాయి. కుల వ‌ర్గ , సామాజిక కోణాల ఆధారంగా ప‌త్రిక‌లు మార్పు చెంద‌డం, ప్ర‌భుత్వాల‌ను నిర్దేశించే స్థాయికి చేరుకోవ‌డం గ‌త కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కీల‌కంగా ఉన్న అతి పెద్ద ప‌త్రిక ఒక‌టి.. ప్ర‌బుత్వాల‌నే నిర్దేశించేస్థాయిలో రాజ‌గురువుగా పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా టీడీపీ ప్ర‌భుత్వానికి క‌ర‌ప‌త్రంగా ఉన్నద‌నే పేరు తెచ్చుకున్న ఈ ప‌త్రిక తాజాగా ఏర్ప‌డిన వైసీపీ ప్ర‌భుత్వంతో దాదాపు మూడు నెల‌ల పాటు సంయ‌మ‌నం పాటించింది.


ఎక్క‌డా ఎలాంటి వ్య‌తిరేక వార్త‌లు కూడా రాయ‌కుండా చూసుకున్న ఈ పత్రిక‌.. ఫ‌ర్వాలేదు.. జ‌గ‌న్‌తో ఏదో స‌ర్దు బాటు ధోర‌ణిలోనే వెళ్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే ఓ విష‌యంపై స‌ద‌రు ప‌త్రిక రాసిన క‌థ‌నం.. ఇప్ప‌టి వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించిన విధానాన్ని తోసిపుచ్చింది. పోల‌వ‌రం టెండ‌ర్ల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌బుత్వం రివ‌ర్స్ విధానానికి తెర‌దీసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా న‌వ‌యుగ కంపెనీకి  నామినేష‌న్ ప‌ద్ధ‌తిపై గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌గించిన 3 వేల కోట్ల పైచిలుకు ప‌నుల‌ను ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావించి ముందుకు వెళ్లింది.


ఈ క్ర‌మంలోనే అటు కేంద్రం నుంచి ఇటు ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  స‌రే! ఇప్ప‌టి వ‌ర‌కు సంయ‌మనం పాటించిన రాజ‌గురువు ప‌త్రిక‌.. ఇప్పుడు ఒక్క‌సారిగా అస్మ‌దీయుల‌కు మేలు చేసేందుకే జ‌గ‌న్ రివ‌ర్స్ టెండ‌ర్లు సృష్టించార‌ని పేర్కొంటూ వెలువ‌రించిన  క‌థ‌నం ప్రభుత్వానికి స‌ద‌రు ప‌త్రిక‌కు మ‌ధ్య భారీ గ్యాప్‌ను పెంచేసింది. నిజానికి ప్ర‌భుత్వ వాద‌న ప్ర‌కారం చూస్తే..రివ‌ర్స్ ద్వారా 20 నుంచి రు. 100 కోట్ల వ‌ర‌కు ఖ‌జానాకు మేలు జ‌రుగుతుంద‌ని చెబుతోంది. అయితే, రివ‌ర్స్ వ‌ల్ల త‌న అనుకున్న వారికి మేలు చేసేందుకు జ‌గ‌న్ ఇలా చేస్తున్నార‌ని ప‌త్రిక వండివార్చింది.


దీనిపై జ‌గ‌న్ స‌ర్కారు తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడి చేసింది. ఎవ‌రికి ఎవ‌రు అస్మ‌దీయులు? అంటూ మంత్రి అనిల్ కుమార్ మండిప‌డ్డారు. న‌వ‌యుగ‌తో రాజ‌గురువు కుటుంబానికి ఉన్న వియ్యంకుల సంబంధం కార‌ణంగానే ఇప్పుడు అస్మ‌దీయుల ప‌క్షాన ప‌త్రిక మాట్లాడుతోంద‌ని నిప్పులు చెరిగారు. ఏనాడైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని కానీ, పోల‌వ‌రంలో జ‌రిగిన అన్యాయాల‌ను కానీ రాశారా? అంటూ నిగ్గ‌దీశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌గురువు ప‌త్రిక సంపాయించుకున్న క్రెడిబిలిటీ దెబ్బ‌తింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: