బీజేపీ ర‌థ‌సార‌థి, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్రపంచంలోనే విశేష ఆదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందిన‌ మోదీజీకి...రాజకీయాలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు, నెటిజన్స్‌ ఈ జాబితాలో ఉన్నారు.  కొన్ని మిలియన్ల ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన పుట్టినరోజు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ సృష్టిస్తోంది. 


హ్యాష్‌ట్యాగ్‌ బర్త్‌డే మోదీ పేరుతో ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న వరుసలో మూడో స్థానంలో నిలిచింది. ఇండియాలో టాప్‌-10 ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో మోదీ పుట్టినరోజుకు సంబంధించినవే ఏడు ఉండడం గమనర్హం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఇప్పటివరకు 11 లక్షల 37 వేల మంది ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు.


మ‌రోవైపు, ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్రమోదీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ తెలిపారు. నరేంద్రమోదీజీకి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. కాగా, సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో మోదీ భారీ బొమ్మ గీసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్న పిల్లలు సైతం పాట రూపంలో ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపడం విశేషం.


ఇదిలాఉండ‌గా, ప్రధాని నరేంద్ర మోదీ త‌న‌ 69వ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్‌లోని నర్మదా జిల్లా నందు గల గురుదేశ్వర్‌ దత్‌ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి ఆయన పేరున అర్చన చేసి, దీవించారు. మ‌రోవైపు, లక్నో : ప్రధాని నరేంద్ర మోదీని అమితంగా అభిమానించే ఓ వ్యక్తి.. ఆయన జన్మదినం సందర్భంగా.. హనుమాన్‌కు బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వారణాసి నియోజకవర్గానికి చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి.. మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని ఎన్నికల సమయంలో మొక్కుకున్నట్లు సింగ్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్‌డే సందర్భంగా ఆ బంగారు కిరీటాన్ని దేవునికి సమర్పించానని చెప్పారు. ఈ కిరీటం 1.25 కేజీల బరువున్నట్లు పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతుందన్నారు అర్వింద్ సింగ్. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: