యురేనియం తవ్వకాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. యురేనియం తవ్వకాలకు తాము అనుమతి ఇవ్వలేదని, అవసరమైతే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా పంపారు. అయితే కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా అనుమతుల్లో భాగస్వాములేనని గుర్తుచేశారు. 


సేవ్ నల్లమల పేరుతో మొదలైన యురేనియం ఉద్యమం రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. నల్లమల ప్రాంతంలో స్థానికుల ఆందోళనతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకమని ప్రకటించింది. తాము అనుమతి ఇవ్వలేదనీ, భవిష్యత్తులో ఇచ్చే ఉద్దేశం కూడా లేదని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. 


నల్లమలలోనే కాదు తెలంగాణలో ఎక్కడా యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2016లో యురేనియంపై పరిశోధనకు అనుమతిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు తాము అనుమతి ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడే.. యురేనియం పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అనుమతిచ్చారని, ఇప్పటికీ పరిశోధన మాత్రమే జరుగుతోందని, తవ్వకాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కిషన్ రెడ్డి. 


మొత్తం మీద రాజకీయ నేతల రచ్చ చూస్తుంటే.. యురేనియం అనుమతుల్లో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని స్పష్టమౌతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా యురేనియానికి సంబంధించి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాయి. మరి యురేనియం తవ్వకాల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారానికి ఎపుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: