మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మరణం టీడీపీకి తీరని లోటనే చెప్పాలి. 37 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎంతోమంది కీలక నేతల్ని పోగొట్టుకుంది. ఎలిమినేటి మాధవరెడ్డి దగ్గర్నుంచి ఇప్పుడు కోడెల వరకు ఎంతోమంది వివిధ కారణాలతో చనిపోయారు. 


రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండెపోటు.. ఇలా కారణం ఏదైనా కావచ్చు. కొన్నాళ్లుగా టీడీపీని సీనియర్ నేతల మరణాలు వెంటాడుతున్నాయి. టీడీపీలో నంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన నేతలు చాలా మంది అకస్మాత్తుగా చనిపోయి.. పార్టీకి, కార్యకర్తలకు తీరని విషాదం మిగిల్చారు. గతంలో హోం మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి మావోయిస్టుల దాడిలో మరణించారు. మరో హోం మంత్రి ఇంద్రారెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయి.. పార్టీకి షాకిచ్చారు. 


కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఎదిగిన దేవినేని వెంకటరమణ కూడా అకస్మాత్తుగా రైలు ప్రమాదంలో చనిపోయారు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న వెంకటరమణను.. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆయనను కబళించింది. చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా గుండెపోటుతో చనిపోయారు. 


గుంటూరు జిల్లాకు చెందిన లాల్ జాన్ బాషా.. రాష్ట్ర స్థాయిలో కీలక మైనార్టీ నేతగా గుర్తింపు పొందారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నంబర్ టూగా ఉన్న ఎర్రన్నాయుడు కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో.. అసువులు బాశారు. ఇక లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన గంటి మోహన చంద్ర బాలయోగి.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం టీడీపీకి తీరని విషాదమే మిగిల్చింది. 


పదేళ్ల క్రితం జరిగిన పరిటాల రవి హత్య.. రాయలసీమ టీడీపీ నేతలకు కోలుకోలేని షాకిచ్చింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రభావం చూపించగలిగే రవి లేని లోటు.. టీడీపీకి ఇప్పటికీ తీరలేదంటే అతిశయోక్తి కాదు.ఆయన్ను ప్రత్యర్థులు వేటాడి పార్టీ ఆఫీస్ లోనే దారుణంగా చంపేశారు. ఇక ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఓ అభిమాని కూతురి పెళ్లికి వెళ్తున్న హరికృష్ణ.. స్టేట్ హైవేలో యాక్సిడెంట్ అయి మరణించారు. 


టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించే కీలక నేతలలో ఒకరైన ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విశాఖ జిల్లాకు చెందిన ఈయన.. విశాఖ ఎంపీగా కూడా సేవలు అందించారు. గీతమ్స్ విశ్వవిద్యాలయం స్థాపించి.. గీతమ్స్ మూర్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇక కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న భూమా నాగిరెడ్డి.. అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో.. టీడీపీ షాకైంది. మంచి ఆరోగ్యంతో.. చాలా ఉత్సాహంగా ఉండే భూమాకు హార్ట్ ఎటాక్ రావడమేంటనే చర్చ అప్పట్లో జరిగింది. 


చివరిగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. హైదరాబాద్ నివాసంలో ఉరేసుకుని చనిపోవడంతో.. టీడీపీ నేతలు షాక్ తిన్నారు. ఎంతో ధైర్యవంతుడిగా పేరున్న కోడెల.. ఇలా సూసైడ్ చేసుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: