సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినం.. కానీ కొందరు దీన్ని తెలంగాణ విలీన దినం అంటారు. రజాకార్ల అరాచకాల నుంచి నిజాం నియంతృత్వం నుంచి విముక్తి పొందిన దినం కాబట్టి విమోచనమే అంటారు బీజేపీ వంటి పార్టీలు.. కానీ అలా జరపడం ద్వారా హిందూ-ముస్లిం వివాదంగా మారే అవకాశముంది కాబట్టి దీన్ని విలీనం అంటారు మరికొందరు.


కానీ.. తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ మాత్రం ఈ అంశంపై టీఆర్ఎస్ ను ఇరుకుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ విమోచన సభలు నిర్వహించి సవాల్ విసురుతోంది. ఆ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విమోచన దినోత్సవం అధికారికంగా జరగాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ విమోచన దినోత్సవ వేడుకలు నాంది పలుకుతాయన్నారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ సెప్టెంబర్ 17.. చాలా పవిత్రమైన రోజు.. నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయట పడిన రోజు.. ఈరోజే విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం.. తెలంగాణకు 13నెలలు ఆలస్యంగా స్వాతంత్ర్య వచ్చింది. ఈ 13నెలలు నిజాం అనేక అకృత్యాలు చేశాడు. విలీనం కోసం అనేక పర్యాయాలు నిజాంతో పటేల్ చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.


ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రాలేదు... స్వరాష్ట్రం వస్తే విమోచన దినోత్సవం జరుపుకుందాం అన్న కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు జరపడం లేదు. టీఆర్ఎస్ మజ్లీస్ పార్టీతో కలిసి పని చేస్తోంది. టీఆర్ఎస్ , కాంగ్రెస్, టీడీపీ మజ్లీస్ చేతిలో కీలు బొమ్మలు. నిజాం ఆదర్శమని కేసీఆర్ చెప్పి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.. రజాకార్ల వారసత్వమే మజ్లీస్.. అంటూ కిషన్ రెడ్డి దుయ్య బట్టారు. మరి టీఆర్ఎస్ పై దూకుడుగా వెళ్తూ.. తెలంగాణలో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీ కోరిక తీరుతుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: