తెలంగాణ సీఎం కేసీఆర్ మహా ప్లాన్ రచిస్తున్నారు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మహారాష్ట్రలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారట. అంటే మొత్తం 8 చోట్ల పోటీ చేసేందుకు కారు పార్టీ జోరు చూపిస్తోందన్నమాట.


ఇప్పుడీ మహా ప్లాన్ ఎందుకంటే.. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహా రాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో కలిపేయమని అడుగుతున్నారట. నాందేడ్‌ జిల్లా నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారట. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని కోరారట. అలా చేయకపోతే.. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ను కోరారట.


మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి టికెట్లు ఇచ్చేందుకు కూడా టీఆర్ఎస్ రెడీ అయ్యిందట. నాందేడ్‌ జిల్లా నయ్‌గావ్‌, బోకర్‌, డెగ్లూర్‌, కిన్వట్‌, హథ్‌ గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇప్పుడు కొందరమే వచ్చాం.. మళ్లీ ఇంకొందరు నాయకులు తీసుకొచ్చి కలుస్తాం అన్నారట. వారి ఉత్సాహం చూసి కేసీఆర్ కు కూడా కాస్త జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది.


నాందేడ్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్‌, రజూర నుంచి టీఆర్ఎస్ టికెట్‌ కావాలని అడుగుతున్నారని కేసీఆర్ తెలిపారు. వారి వినతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే పోటీ చేస్తామని చెప్పినట్టేగా.. మరి కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో. తేడా వస్తే.. ఓవరాక్షన్ చేశారు.. ఓడిపోయారు అన్న చెడ్డపేరు కూడా రావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: