రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధర ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉల్లి పండించే కర్నూల్ జిల్లాలో ఉల్లి ధర క్వింటా 3,000 రుపాయలకు పైగా పలుకుతోంది. వ్యాపారులు డిమాండ్ కు సరిపడే ఉల్లి ఉత్పత్తులు లేకపోవటం వలనే ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉల్లి పంట వరదలకు మునిగిపోయింది. 
 
అందువలన ఆ రెండు రాష్టాల్లో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉల్లి పంట సాగు తక్కువగానే ఉందని తెలుస్తోంది. వ్యాపారులు వినియోగదారులకు కిలో ఉల్లి 40 నుండి 50 రుపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఉల్లి ధరల పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం ధరలను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. 
 
అధికారులు నాణ్యమైన ఉల్లి దిగుబడులను మార్కెట్ కు తీసుకొనివస్తే మంచి ధర పొందవచ్చని రైతులకు సూచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటినట్లు తెలుస్తోంది. వరదలు, భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే ఉల్లి ఢిల్లీ రిటైల్ మార్కెట్ కు రాకపోవటం వలన ధరలు భారీగా పెరిగినట్లు సమాచారం. వారం రోజుల క్రితం ఢిల్లీలో వ్యాపారులు కిలో ఉల్లి 25 రుపాయల నుండి 30 రుపాయలకు విక్రయించేవారు. 
 
ప్రస్తుతం కిలో ఉల్లి ఇక్కడ 50 రుపాయల నుండి 60 రుపాయలు పలుకుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉల్లిని తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి రాకపోవటం వలన ఉల్లి రేటు భారీగా పెరిగిందని ఢిల్లీకి చెందిన వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు మూడు నెలల వరకు ధరలు తగ్గే అవకాశం ఉండదని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: