ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై చేస్తున్న విమర్శలు మరీ విచిత్రంగా ఉంటున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.. బాధాకరమే.. పల్నాటి పులి లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఎలాంటి అంతర్మథనం ఉందో అది ఆయనకే తెలియాలి. లేదా నిలకడ మీద తెలుస్తుంది.


కానీ ఆయనపై వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్టిన కేసుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం విచిత్రంగా ఉంది. అది కూడా అవి చాలా పెట్టీ కేసులను చంద్రబాబే చెబుతున్నారు. కోడెల ఎన్టీఆర్ హయాంలో హోం మంత్రిగా పని చేశారు. అంటే పోలీసులకే బాస్.. అలాంటి వ్యక్తికి పెట్టీ కేసుల వల్ల ఏమీ కాదని తెలియదా..


ఇవన్నీ కోర్టుల్లో నిలవవని తెలియదా.. ఎలాగూ పెట్టింది తప్పుడు కేసులని చంద్రబాబే చెబుతున్నారు. మరి అలాంటప్పుడు తప్పుడు కేసులకు భయపడిపోయి.. ఒక మాజీ హోంమంత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటారా.. చంద్రబాబు ఎందుకు ఇంత దూకుడుగా కోడెల విషయంలో వ్యవహరిస్తున్నారో రాజకీయ విశ్లేషకులకు అర్థం కాని పరిస్థితి ఉంది.


చంద్రబాబు దూకుడు చూస్తుంటే.. కోడెల మరణాన్ని అంతా వైయస్‌ జగన్‌ మీద, వైయస్‌ఆర్‌సీపీపై రుద్ది ఒక సింపథీ పొందాలని, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు కోడెల ఆత్మహత్య తర్వాత ఇప్పటిదాకా నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చారు. చెప్పిందే చెప్పి.. ఏదో విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కోడెల ఆత్మహత్య ఆత్మహత్య కాదు. ప్రభుత్వ హత్య అని బ్రాండ్‌ చేసే కార్యక్రమం కనిపిస్తోంది.


కోడెలకు పల్నాటి పులి అని పేరుంది. కోడెల వంటి దూకుడుగా వ్యవహరించే నాయకుడు.. అనేక క్లిష్టపరిస్థితుల్లో నిలబడి ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు కేసులు పెట్టినా ఎప్పుడు బెదరలేదు. రాటుతేలిన రాజకీయ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాడని టీడీపీ నేతలే ఓవైపు చెబుతున్నారు. మరోవైపు పెట్టీ కేసులకు భయపడిపోయాడని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: