మాజీ  శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కోడెల శివ ప్రసాద్ రావు గారి మరణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనే చెప్పాలి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో డాక్టరు వృత్తి  చేపట్టి, అక్కడి పేద ప్రజల కోసం ఆసుపత్రిని నెలకొల్పి వైద్య సేవలు అందించిన కోడెలను అప్పటి టీడీపీ అధనేత శ్రీ ఎన్టీఆర్ గారు తమ పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తరువాత కోడెల గారు నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్యెల్యే గా పోటీ చేసి పలు పర్యాయాలు గెలవడం జరిగింది. ఆ తరువాత కోడెల, ఎన్టీఆర్ గారు మరియు చంద్రబాబుగారి నాయత్వాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు శాఖల్లో మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. ఇకపోతే 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీకి దిగిన కోడెల విజయ ఢంకా మ్రోగించగా, తరువాత ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 లో టిడిపి తరపున గెలిచిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై సచివాలయ ఫర్నీచర్ ని అక్రమంగా తన సొంతానికి వాడుకున్నారు అనే నింద మోపబడింది. 

అది నిరూపణ కాకపోవడంతో, టిడిపి అధినేత చంద్రబాబు సహా మరికొందరు టిడిపి నాయకులు కూడా కోడెలపై వచ్చిన నిందలు పెద్దగా ఖండించలేదనే చెప్పాలి. అయితే అప్పటినుండి పలు విధాలుగా మానసిక క్షోభ అనుభవిస్తున్న కోడెల, కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మరియు కుమార్తె పై బలవంతపు వసూళ్ల కేసులు బనాయించబడడంతో మరింత ఆందోళన చెందారు. అయితే ఆ తరువాత నుండి కొన్నాళ్ళు మీడియాకు దూరంగా వ్యవహరించిన కోడెల, రెండు రోజుల క్రితం హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలిచి వేసింది. అయితే ఆయనది హత్య అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పర్సనల్ సెల్ ఫోన్ మిస్ అయినట్లు పోలీసులు తేల్చడంతో ఈ కేసులో పలు విధాలుగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన కుమార్తె మాత్రం, ఆత్మహత్య జరిగిన రోజు ఉదయం కోడెల గారు పైన తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారని, 

చాలాసేపటి కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే, ఆయన ఉరి వేసుకుని కనబడ్డారని, వెంటనే హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పారు. మాములుగా ఆ విధంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్తారు, మరి అటువంటిది కోడెల గారి కుటుంబ సభ్యులు ఆయన్ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందకు తీసుకెళ్లారు అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోడెల బంధువైన సాయి అనే వ్యక్తి, కోడెల గారి కుమారుడు శివరాం, తనను కొద్దిరోజలుగా మానసికంగా హింసిస్తున్నాడని , ఆ విషయం తన వద్ద కోడెల గారు ఎన్నో సార్లు చెప్పుకుని బాధపడ్డారని, కాబట్టి ఆయన హత్యకు కారకుడు శివరామే నని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కోడెల ఆత్మహత్య విషయమై ఇన్నివిధాలుగా అనుమానాలు రేకెత్తుతుండడంతో అసలు ఆ సమయంలో ఏమి జరిగిందనే తెలుసుకోవడానికి పోలీసులు నిశితంగా విచారణ చేపట్టారు. మరికొద్దిరోజలు గడిస్తేనేగాని పూర్తి విషయాలు వెలుగులోకి రావని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: