ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కోడెల నరసరావుపేట నుంచి ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవులు నిర్వహించారు. కోడెల మరణంతో ఇప్పటికే కోట సెంటర్‌లోని ఆయన ఇంటికి అనుచరులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయనకు నరసరావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భారీ అనుచర గణం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తోంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 15 రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు నరసరావుపేట ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. కేసుల పేరుతో వేధింపులకు గురి చేయడంతో బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతోంది. అధికార పార్టీ దాష్టీకాలు, అవమానాలు భరించలేకే కోడెల ఉరి వేసుకున్నారని, కోడెలది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యేనని పేర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో 144 సెక్షన్ విధించడం విమర్శలకు తావిస్తోంది.నరసరావుపేటలో 144 సెక్షన్ విధింపుపై టీడీపీ మండిపడుతోంది.

కోడెలను మానసికంగా హింసించి చంపడమే కాకుండా ఆయన అంతిమయాత్ర కూడా జరగకుండా అడ్డుపడుతోందని ఆరోపిస్తోంది. అందుకే ప్రభుత్వం శాంతిభద్రతల పేరుతో నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. కోడెల మరణానికి కారణమవడమే కాకుండా అంతిమయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా కోడెల మరణంపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్న వేళ.. ఆయన సమీప బంధువు సాయి సంచనలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని, ఎలాంటి అనుమానాలు లేవని కోడెల కుమార్తె విజయలక్ష్మి చెప్పారు. కానీ ఆయన బావమరిది కంచేటి సాయి మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని ఆయన్ను కొడుకు శివరామే హత్య చేయించారని ఆరోపించారు. శివరామ్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కోడెల తనతో చెప్పారన్నారు. కోడెల మరణంపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సత్తెనపల్లి డీఎస్పీకి క్రోసూరు మండలం పీసపాడుకి చెందిన కంచేటి సాయి ఫిర్యాదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: