కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొద్దికాలంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య కార్యక్రమం.. ఆయుష్మాన్ భారత్‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంపై స్పందించారు. ఆయుష్మాన్ భారత్ బీమా పథకంలో మోసాలకు, అవినీతికి పాల్పడిన దవాఖానల పేర్లను బహిరంగ పరుస్తామని తెలిపారు. త‌ద్వారా కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కు షాకిచ్చారు.



ఆయుష్మాన్ భారత్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో గ‌త ఏడాది  సెప్టెంబ‌ర్ 23న‌ ప్రారంభించారు గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటివాటితోపాటు మొత్తం 1300 రకాలైన వ్యాధులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రపంచంలో అమలవుతున్న అతిపెద్ద ప్రభుత్వం పథకం ఇదే. అమెరికా, కెనడా, మెక్సికో.. ఈ మూడుదేశాల మొత్తం జనాభాకన్నా ఎక్కువగా భారత్‌లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు అని మోదీ చెప్పారు. దేశంలోని ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో 2500 ఆధునిక దవాఖానలు రానున్నాయని, వీటిద్వారా ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయని మోదీ వివరించారు. దేశంలో 50కోట్లమంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా రని, పేదల ఆశీస్సులతో యంత్రాంగం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్‌పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. గరీబీ హటావో అంటూ నినదించిన నేతలు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారే తప్ప పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలతో పేదలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, వారి ఆత్మగౌరవాన్నీ విస్మరించిందని మోదీ ఆరోపించారు.


కాగా, తాజాగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సుమారు 1200 కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. 338 దవాఖానలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఖరి మార్చుకోని 97 దవాఖానలను పథకం నుంచి తొలిగించామన్నారు. ఆరు దవాఖానలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కొన్నింటిపై రూ.1.5 కోట్లకు పైగా జరిమానా విధించామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెల 23 నాటికి ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని, 15-30 మధ్య ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవం జరుపుతున్నట్లు హర్షవర్ధన్ చెప్పారు. ఈ నెల 30, అక్టోబర్ ఒకటిన ఆరోగ్య మంథన్ నిర్వహిస్తామని, ప్రధాని మోదీ పథకం అమలు పురోగతిని సమీక్షిస్తారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: