తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ‌రో కీల‌క ప్ర‌క్రియ‌కు ఓకే చెప్ప‌నున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆసరా పథకంపై ఆయ‌న సార‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్త పింఛన్‌దారుల ఎంపిక కసరత్తు మొదలైంది. సంక్షేమంలో భాగంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామనడంతో కొత్త పింఛన్‌దారుల జాబితా కొంత ఆలస్యం అవుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో గ్రామాలవారీగా పరిశీలన ప్రారంభించారు. 


వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.9వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారు. ఎన్నిక‌ల హామీ ప్ర‌కారం, వృద్ధాప్య పింఛన్లకు వయస్సును 57 ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో అదనంగా లబ్ధి పొందేవారి జాబితా తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2018 నవంబర్‌లో విడుదల చేసిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారుల ప్రాథమిక జాబితా సిద్దంచేశారు. ఈ జాబితా ప్రకారం ఇతర పింఛన్లు పొందుతున్న వాళ్లు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వపరంగా ఉద్యోగాలు చేస్తున్నవారుగానీ, సదరు కుటుంబంలో ఇతర సభ్యులెవరైనా లబ్ధిదారులు ఉన్నారా? అనే అంశాలపై లోతుగా పరిశీలన చేస్తున్నారు.


రాష్ట్రంలోని 32 జిల్లాల్లో కొత్త లబ్ధిదారుల జాబితా దాదాపు సిద్ధమయినట్టు సమాచారం. ఈ జిల్లాల్లో దాదాపు 5.30 లక్షల మంది ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలో లెక్క తేల్చేపనిలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 32 వేల మంది కొత్త పింఛన్లకు అర్హులుగా ఉండగా.. ప్రాథమిక జాబితా ప్రకారం గ్రేటర్‌లో దాదాపు లక్ష వరకు ఉండనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు.


గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లతోపాటు దివ్యాంగుల పింఛన్లను రెట్టింపుచేసి పంపిణీ చేస్తున్నారు. ఆసరా పింఛన్‌దారులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం డిసెంబర్‌లోనే కసరత్తు మొదలైనప్పటికీ వరుస ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 39.32 లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా.. పెంచిన పింఛన్ సొమ్ము ప్రకారం రూ.842 కోట్లు ప్రతి నెలా చెల్లించాల్సి వస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: