సేవ్ నల్లమల అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది.  అసలు పవన్ కళ్యాణ్ ఏమిటీ?... ఆయన స్థాయి ఏమిటీ??, పవన్  నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల హాజరుకావడం హాస్యాస్పదంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  కుంతియా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు,  ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఎలా హాజరవుతారని  ఆయన పార్టీ నేతలకు  క్లాస్ పీకినట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 పవన్ కళ్యాణ్ స్థాయి ఏమిటో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో   ప్రజలు తేల్చి చెప్పారని,  ఇక ఆయనకు తెలంగాణలో కూడా పెద్దగా ఆదరణ లేదని అటువంటప్పుడు పవన్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే మైలేజ్ ఏమిటనీ అయన  సీనియర్ నేతలను  నిలదీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి .  కాంగ్రెస్ తో పవన్ కలిసి వస్తానంటే ఓకే కానీ పవన్ తో కాంగ్రెస్ నాయకులు కలిసి వెళ్లడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు గాంధీభవన్ వర్గాలు  చెబుతున్నాయి.


  అయితే సేవ్ నల్లమల అంటూ పవన్ నేతృత్వం లో  అఖిలపక్షం నిర్వహించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా  కదలిక వచ్చిందన్న వాదనలు లేకపోలేదు .   అసెంబ్లీ సాక్షిగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందేనని పలువురు గుర్తు చేస్తున్నారు .  అయితే ఈ విషయాలేవీ  పరిగణలోకి తీసుకోకుండా  కుంతియా,  పవన్ స్థాయి గురించి మాట్లాడడం పట్ల  జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు .  పవన్ ఏమిటీ  పవన్ స్థాయి ఏమిటనీ  ప్రశ్నిస్తున్నా కుంతియా  ముందు తన స్థాయి ఏమిటో  తెలుసుకోవాలని  జనసైనికులు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: