ఇప్పుడు అన్ని వ‌ర్గాల్లో చ‌ర్చంతా...ఆర్థిక‌మాంద్యం గురించే. వినియోగ రంగాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. పడిపోతున్న పెట్టుబడులు, పోతున్న ఉద్యోగాలు 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని మసకబారుస్తున్నాయి. భారత ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా దిగజారింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల‌ కనిష్ఠానికి పడిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5 శాతంగా నమోదైంది. తయారీ రంగంలో క్షీణిత, వ్యవసాయ రంగంలో స్తబ్ధత, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మందగించడం, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వంటి కారణాలతో గతంలో 5.8 శాతంగా ఉన్న జీడీపీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతానికి దిగజారినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది.


అయితే, దీంతో దేశంలో ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలను కల్లలు చేస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులపై మాంద్యం మబ్బులు ముసురుకున్నాయి. ‘అందరికీ ఇండ్లు’ అన్న నినాదంతో ప్రత్యేకంగా మోదీ దృష్టి సారించిన నిర్మాణ రంగం.. కష్టాల కడలినే ఈదుతున్నది. అమ్మకాల లేమితో ఇబ్బందులు పడుతుంద‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. భారత నిర్మాణ రంగ డెవలపర్ల గణాంకాల ప్రకారం అమ్ముడుకాని ఇండ్లు 4.12 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు. వీటి గరిష్ఠ ధర రూ.45 లక్షలు. అంటే సరసమైన ధరల గృహాలకూ డిమాండ్‌ తగ్గిందని అర్థమవుతున్నది.


న‌గ‌రాల ప్ర‌కారం చూస్తే....పుణెలో 98,378 యూనిట్లు, చెన్నైలో 18,709, గుర్గావ్‌-నోయిడాల్లో దాదాపు 58 వేలు, అహ్మదాబాద్‌లో 45 వేల యూనిట్లు అమ్మకాలు లేక అలాగే పడి ఉన్నాయి. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్ణయాలతోనే దేశీయ నిర్మాణ రంగం కోలుకోలేని దెబ్బ తింది. దాదాపు మూడేండ్ల క్రితం మొదలైన నగదు కొరత కష్టాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ సమయంలో ముంచుకొచ్చిన మాంద్యం.. మరింతగా రియల్‌ ఎస్టేట్‌ను కుంగదీసింది. గడిచిన ఏడాది కాలంలో 4 శాతం దిగజారిన బీఎస్‌ఈ రియల్టీ సూచీ.. పదేండ్లలో 55 శాతం క్షీణించడం ఇందుకు నిదర్శనమ‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: