ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధించింది ప్రభుత్వం. ఆ మేరకు వైద్యుల జీతాలు పెంచాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఆరోగ్యరంగంపై సుజాతారావు కమిటీ 100కు పైగా సిఫార్సులు చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు తేవాలని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులకూ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


ఏపీ సర్కారు వైద్య రంగంలో సంస్కరణలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ 100కు పైగా చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధించి.. ఆ మేరకు జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదనలు తయారుచేయాలని కమిటీని ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించారు సీఎం. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో.. సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 నుంచి ఈ సేవలు మొదలౌతాయి. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు.  ఆరోగ్యశ్రీలో అదనంగా 2 వేల వ్యాధుల్ని చేర్చి.. పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తారు. జనవరి 1 నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు దాటికే ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని, ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా ఇది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. 


ఆపరేషన్ చేయించుకున్న వారు కోలుకునేంత వరకూ.. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ విస్తరించడంపై చర్చ జరిగింది. తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇప్పటికే నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల్ని ఒకే కేటగిరీ కిందకు తీసుకొచ్చి వారికి నెలకు 5 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: