నీటిపొదుపు, ఇంకుడుగుంతల నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కును బుధవారం చెన్నె జలమండలి అధికారులు సందర్శించారు. థీమ్ పార్కును సందర్శించి పార్కు విశేషాలను, వివిధ నీటి సంరక్షణ చర్యలు, నీటిని ఓడిసి పట్టే చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో చెన్నై జలమండలి సూపరింటెండింగ్ ఇంజనీర్ సమీ లాల్ జాన్ సన్, డిప్యూటీ హైడ్రాలజిస్ట్ పి. సుబ్రమణియన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.ఎస్. ఉమ శంకర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. ప్రవీణ్ లు ఉన్నారు. అనంతరం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిషోర్ తో సమావేశమయ్యారు.



జలమండలిలో చేపడుతున్న బిల్లింగ్, మీటర్లు, రెవెన్యూ వంటి విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలమండలి పరిధిలోని  ప్రతి సెక్షన్ లో మేనేజర్ 10 శాతం (ఎన్ఆర్ డబ్ల్యూ) లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించగలిగితే జలమండలికి రూ. 10కోట్ల డబ్బు ఆదా అవుతుందని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ తెలిపారు. డిసెంబర్ నాటికి ఎంత నీటి వృథాను ఆరికట్టారో సెక్షన్ వారీగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.  ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో  రెవెన్యూ, వాక్ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ఆపరేషన్స్-2 డైరెక్టర్ శ్రీ. పి.రవితో పాటు సీజీఎమ్ లు, జీఎమ్  లు, డీజీఎమ్ లు, మేనేజర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ఎండీ దాన కిషోర్ మాట్లాడారు. 



అలాగే వందశాతం బిల్లుల జారీ, కలెక్షన్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ నెల చివరి నాటికి ప్రతి మేనేజర్ 20 మంది వాక్ వాలంటీర్ల సాయంతో కనీసం 850 ఇళ్లకు నీటిపొదుపుపై ఎరుపు, ఆకుపచ్చ రంగులతో గుర్తింపు చిహ్నాలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నూతనంగా మంజూరు చేసే నల్లా కనెక్షన్లకు ఏఎమ్ఆర్ మీటర్లను బిగించాలని సూచించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించే మేనేజర్లు, లైన్ మెన్లు అనుమతులు లేకుండా తీసుకున్న అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని  వివరించారు. తమ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: