నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన అనంతరం కూడా   సినీ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని విన్పించారు . యురేనియం తవ్వకాలపై కొంతమంది సినీ హీరోలు మిడిమిడి జ్ఞానం తో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ , అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించిన విషయం తెల్సిందే .  అయినా అధికార పార్టీ నేతలను విమర్శలను లెక్క చేయకుండా విజయ్  మీడియా ముందుకు వచ్చి యురేనియం తవ్వకాలు పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు  కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.


 నల్లమల అడవుల్లో  యురేనియం తవ్వకాలు వ్యతిరేకిస్తూ,   సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాన్ని తొలుత  వెల్లడించింది  విజయ్ దేవరకొండ.  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ  స్వచ్ఛందంగా మీడియా ముందుకు రావడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా?  అన్న కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో  ఇప్పుడు విస్తృత చర్చ కొనసాగుతోంది.  రాష్ట్రంలో ఒకవైపు యూరియా కొరత,  డెంగ్యూ ... విష జ్వరాలు ప్రజలు ఇబ్బందులుపడుతుండగా  ,  మరోవైపు సెప్టెంబర్ 17  న   విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదంటూ  బీజేపీ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే  ప్రయత్నాన్ని చేస్తోంది.


 ఈ అంశాల అన్నింటి పై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అధికార పార్టీ విజయ్ దేవరకొండ ను అస్త్రంగా  వాడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి .  టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబానికి, సినీ హీరో  విజయ్ దేవరకొండ అత్యంత సన్నిహితుడని , యువత లో మంచి పాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరోను వాడుకుని  ప్రజల దృష్టి మార్చాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని పలువురు విపక్ష నేతలు ప్రైవేట్ సంభాషణల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఒక సినీ హీరో మంచి కాజ్  కోసం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెబితే,  దానికి కూడా పెడర్ధాలు వెతకడం విపక్షాలకు చెల్లిందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: