ఏపీ రాజధాని అమరావతిలో గతంలో సచివాలయంలో వర్షపు నీరు లీకైన విషయం తెలిసిందే. నిన్న కురిసిన భారీ వర్షానికి తుళ్లూరు మండలం నేలపాడు వద్ద నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడల్లోంచి నీరు కారింది. గత రెండు రోజులుగా అమరావతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 150 కోట్ల రుపాయలతో షేర్వాల్ టెక్నాలజీని ఉపయోగించి హైకోర్టు భవనాన్ని నిర్మించటం జరిగింది. 
 
వర్షపు నీరు ఏకంగా హైకోర్టు లాబీల్లోకి రావటంతో కూలర్లను బయటపడేసి సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు భవనంలో పలు చాంబర్లలో నుండి వర్షపు నీరు లీకైనట్లు తెలుస్తోంది. గతంలో ఏపీ సచివాలయంలో కనిపించిన పరిస్థితి ప్రస్తుతం హైకోర్టులో కనిపిస్తుంది. హైకోర్టు ఆవరణలోకి వచ్చిన నీటిని సిబ్బంది తోడి బయటపోశారు. దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో జీ+2 విధానంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. 
 
చిన్నపాటి వర్షానికే నీరు వస్తూ ఉండటంతో గత ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టిన కంపెనీ డొల్లతనం వలనే వర్షపు నీరు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనం కొరకు మొదట అధికారులు 98 కోట్ల రుపాయల అంచనాలతో టెండర్లు పిలిచారు. ఆ తరువాత మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మరోసారి 56 కోట్ల రుపాయల అంచనాలతో టెండర్లు పిలిచారు. 
 
2018 మార్చి నెలలో జనరేటర్ రూమ్ కొరకు నిర్మిస్తున్న గదుల్లో రెండు గదుల నుండి వేసిన శ్లాబ్ ఒక్కసారిగా కూలింది. మాజీ మంత్రుల చాంబర్లలో సచివాలయంలో వర్షపు నీరు కారింది. రాజధాని నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలపై విచారణ జరిపించాలని ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది. రాజధానిలోని నిర్మాణాలలో నాణ్యతా లోపం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఘటనతో హైకోర్టు నిర్మాణంలో ఏ మాత్రం ప్రమాణాలు పాటించటం లేదని అర్థమవుతోంది. రాజధాని నిర్మాణాలపై విచారణ జరిపిస్తే మాత్రమే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: