ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అంశం. దీనిపై వైసీపీ - టీడీపీ మధ్య వాదోపవాదాలు ముదిరిపోతున్నాయి. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ వాదిస్తోంది. దీనిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు చూపిన నిర్లక్ష్యం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ధీటుగా బదులిస్తోంది.                                                         



వాస్తవానికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో టీడీపీ నాయకులు ఏం మాట్లాడలేదు. దీనిపై కోడెలకు టీడీపీ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. వర్ల రామయ్య కూడా.. ఈ విషయం నిజమైతే కోడెలపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. చంద్రబాబు కూడా మాట్లాడింది లేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాయుడు మాట్లాడుతూ.. కోడెల ఆత్మహత్యను చంద్రబాబు శవ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. కోడెలకు అనారోగ్యంగా ఉంటే పలకరించని వ్యక్తి చంద్రబాబు అన్నారు. నమ్మకంగా పనిచేసినందుకు అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో చంద్రబాబు నుంచి సానుభూతి దక్కకపోవటంతో ఆయన మనస్థాపానికి గురయ్యారన్నారు. చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కేవలం లక్ష రూపాయల ఫర్నీచర్ అంటూ చంద్రబాబు మాట్లాడటం తగదన్నారు. కోడెల మృతి తర్వాత చంద్రబాబు చూపిస్తున్న సానుభూతి ఆయన జీవించి ఉండగా ఏమైందని అంబటి ప్రశ్నిస్తున్నారు.



మరోవైపు.. కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ నేతలు నేడు మధ్యాహ్నం ఏపీ గవర్నర్ ను కలిసి కోరనున్నారు. ప్రభుత్వం ఆయనను వేధించిన తీరను గవర్నర్ కు వివరించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో వివరించారు. ఇరుపక్షాల వాగ్యుద్దంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం మరెన్ని మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: