ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు భౌతిక కాయానికి ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదు. కోడెలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంగళవారం జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. నేడు నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపు వైఖరి వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కోడెలను చంపించిన ప్రభుత్వమే ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటే ఎలా అంగీకరిస్తామని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే హత్య చేయించి.. అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటే కుటుంబ సభ్యులు ఎలా అంగీకరిస్తారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు.

కోడెల అంత్యక్రియలను నిర్వహించడానికి టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.కోడెల ఆత్మహత్య నేపథ్యంలో సొంత నియోకవర్గంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రకటించారు.

 ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల కుమారుడు రోదిస్తూ తండ్రి చితికి నిప్పంటించారు. వేలాది మంది నేతలు, కార్యకర్తలు అశ్రునయనాలతో కోడెలకు అంజలి ఘటించారు. జోహార్ కోడెల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: