ఇటీవలే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.  రెండోసారి కూడా మోడీనే ప్రజలు ఎన్నుకున్నారు.  గతంలో కంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారు.  ఈ గెలుపుతో బీజేపీ మరింత బలం పుంజుకుంది.  ఈ గెలుపు పార్టీకి దిశా నిర్దేశం చేసింది.  దేశంలో సుస్థిరమైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నది.  జాతీయ భద్రతా విధానం అవలంభించడంతో చాలామంది నేతలు ప్రజలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.  


ఈ క్రమంలోనే దేశంలో ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలని కేంద్రం చూస్తున్నది.  అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే.. ఖర్చు తక్కువగా ఉంటుంది.  ఎన్నికల నిర్వహణ ఈజీ అవుతుంది.  ఐదేళ్లకు ఒక్కసారి అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరపడం వలన ఎన్నికల కమిషన్ కు కూడా పనిభారం తగ్గుతుంది.  తరువాత ఐదేళ్లపాటు ఎన్నికలపై పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు.  దేశంలో అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అన్నది కేంద్రం ఆలోచన.  


అయితే, జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదని రాజకీయాల్లో తలపండిన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. ఈ విశ్లేషణ ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఇపుడు చర్చగా ఉంది.  దేశమంతా ఒక మాట ఉంది. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని. దానికి కారణలు కూడా ఉన్నాయి. మోడీ ఇపుడు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చితికిపోయింది. ఆ పార్టీ మళ్లీ కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లి మరో అయిదేళ్ల పాటు అధికారం పొడిగించుకోవడానికి మోడీ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. 


జమిలీ ఎన్నికలు జరపాలని కేంద్రం అనుకుంటున్నా ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదు. పైగా కేంద్రం కూడా కొంత ఇబ్బందుల్లో ఉన్నది. ఆర్ధిక మాంద్యం, దేశ‌ సరిహద్దుల్లో ఘర్షణలు, దేశంలో అనేక రకాలుగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ జమిలి ఎన్నికలకు వెళ్తారా అన్నది చూడాలి.  ఏపి లో 1999 నుంచి కేంద్రంలో ఎన్నికలు జరిగినప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూన్నాయి.  2014లో వైకాపా 67 సీట్లు గెలుచుకుంటే.. 2019 కి వచ్చే సరికి ఏకంగా 151 స్థానాల్లో విజయంసాధించింది .  మోడీకి గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు పార్లమెంటు లో పెరిగినా ఏపీలో మాత్రం అతి తక్కువ ఓట్లు పడ్డాయి. . రాజకీయ పరిస్థితులు ఇలా ఉంటే జమిలి వస్తే ప్రాంతీయ పార్టీలు నిండా మునిగిపోతాయని జేసీ చెప్పడం ఎంతవరకూ తర్కానికి నిలబడుతుందన్నది ఆలోచిస్తే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: