వైకాపాలో చేరినప్పటికీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తనకు అప్పుడు … ఇప్పుడు … ఎప్పుడైనా రాజకీయంగా  శత్రువేనని  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడే పిల్లి సుభాష్ చంద్ర బోస్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ మారాయి . తెలుగుదేశం నుంచి ఇటీవల తోట త్రిమూర్తులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో  వైకాపా చేరిన విషయం తెల్సిందే . ఈ కార్యక్రమం లో పిల్లి సుభాష్ చంద్ర బోస్ కూడా పాల్గొన్నారు .


వీరిద్దరి మధ్య రాజకీయంగా మొదటి నుంచి  తీవ్ర వైరమే ఉంది . తోట త్రిమూర్తులు వైకాపా లో చేరడం తో ఇరువురి మధ్యనున్న రాజకీయ వైరం సమసిపోతుందని అందరూ భావించారు . కానీ దానికి భిన్నంగా తనకు తోట త్రిమూర్తులు రాజకీయంగా ఎప్పటికైనా తనకు  విరోధేనంటూ పిల్లి సుభాష్ చంద్ర బోస్  ప్రకటించడం పట్ల  వైకాపా వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి .రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులు వైకాపాలో చేర్చుకోవడానికి నిరసిస్తూ , బుధవారం ద్రాక్షారామంలో ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్  కాన్వాయ్ ని దళిత ఐక్య పోరాట వేదిక  కార్యకర్తలు అడ్డుకున్నారు.


 ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక కన్వీనర్  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత వ్యతిరేకి అయిన తోట త్రిమూర్తులు పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నారని ఉప ముఖ్యమంత్రిని  ప్రశ్నించారు.  దానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ తనను మీరెవరూ  శంకించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రం లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టింది అంటే దానికి ప్రధాన కారణం దళితులు అని ఆయన చెప్పుకొచ్చారు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకం  కాదని స్పష్టం చేశారు.  శిరోముండనం కేసు గురించి ముఖ్యమంత్రికి స్పష్టంగా తెలుసునని,  ఈ  కేసును సరిగ్గా వాదించ లేదన్న కారణంగా 20 రోజుల క్రితమే  పిపిని  కూడా మార్చాలని జీవో విడుదల చేయించారన్నారు . మీరు చేసే ధర్నా లో  పాల్గొనడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్న పిల్లి సుభాష్ చంద్రబోస్...  తోట త్రిమూర్తులును పార్టీ లో  ఎందుకు చేర్చుకోవాల్సి  వచ్చిందన్న ప్రశ్నకుమాత్రం  తనకు ముందు రోజు వరకు ఆ విషయం  తెలియదని  చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: