దేశ రాజకీయాల్లో బీజేపీ — తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతూంటాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై ఏస్థాయిలో విరుచుకుపడతారో తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటూ సీఎంగా రాష్ట్రాన్ని నడిపించడంలో ఆమెకు మరెవరూ సాటిరారు. నోట్ల రద్దు విషయంలో ఆమె మోదీకి వ్యతిరేకంగా పోరాడారు. బీజేపీ విధానాలపై వ్యతిరేకంగా ఉండే ఆమె వరుసగా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.



మమతా తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఢిల్లీలో నిన్న ప్రధాని మోదీని కలిసిన ఆమె నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈరోజు మధ్యాహ్నం హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న ఆమె అమిత్ షాతో చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పే ముఖ్యాంశంగా వీరి భేటీ జరిగిందని విశ్వసనీయవర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని, ఇందుకు కేంద్రం ప్రయత్నాలు చేయాలని ఆమె నిన్నటి ప్రధానితో భేటీలో కోరారు. నేడు అదే అంశంపై అమిత్ షాను కలిసారని వార్తలు వస్తున్నాయి. అమిత్ షా బెంగాల్ సీఎంకు సమయమిస్తారా అనే ఊహాగానాలు కూడా జరిగాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ వీరిద్దరి భేటీ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా.. కేవలం ఈ అంశంపైనే రెండు పార్టీల మధ్య భేటీ జరిగిందని అంటున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా ఆమె భేటీ కావలసి ఉంది.



బీజేపీ జాతీయ ప్రధాన పార్టీ అయితే తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ప్రధాన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు. బీజేపీ విధానాలను, మోదీ నిర్ణయాలను ఎంతో ధైర్యంతో, మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో ఆమె విమర్శించేవారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించటమే ప్రధాన అజెండాగా తన వంతు ప్రయత్నాలు చేశారు. అలాంటి మమతా అదే బీజేపీ నాయకులను కలవడం దేశంలో రెండు రోజులుగా సంచలనం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: