వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు..! పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు తమ వ్యూహాలతో ఆదుకున్న వాళ్లు..! హైకమాండ్‌కు దగ్గరగా ఉంటూ రాజకీయాలు నడిపిన పెద్ద తలకాయలు..! ఇప్పుడు వాళ్లిద్దరూ ఒకే చోటకు చేరారు..! ఎక్కడికో తెలుసా... తీహార్ జైలుకు.  


ఆ ఇద్దరు నేతలు ఒకరు చిదంబరం... మరొకరు డి.కె. శివకుమార్. ఇప్పటికే మాజీ ఆర్ధిక మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీహార్ జైల్లో ఊచలు లెక్కపెడుతుంటే...ఆయనకు తోడుగా అదే జైలుకు వచ్చారు డి.కె.శివకుమార్. ఆర్ధిక నేరాల కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్... అనారోగ్యంతో నిన్నటి వరకు ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే శివకుమార్‌ను తీహార్ జైలుకు తరలించారు.  


 ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిక్కుకున్న చిదంబరం సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 3 వరకు పొడిగించడంతో అప్పటి వరకు ఆయన తీహార్ జైల్లోనే ఉంటారు. తాజాగా ఆయనకు తోడుగా డి.కె. శివకుమార్ కూడా తీహార్ జైల్లో కటకటాలు లెక్కపెడుతున్నారు. 


తీహార్ జైల్ నెంబర్ 7కు ఓ ప్రత్యేకత ఉంది. మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఇందులోనే ఉంచుతారు. డికె శివకుమార్‌తో పాటు చిదంబరం...ఒకే పార్టీకి చెందిన ఇద్దరూ ఆర్ధిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లే.  కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి సంక్షోభంలో పార్టీకి అండగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు తీహార్ జైల్లో పక్కపక్క గదుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైల్లో వీళ్లిద్దరూ కలిసే అవకాశాలు మాత్రం లేవంటున్నారు అధికారులు. రాజకీయాల్లో తలపండిన ఆ నేతలు.. కలిసి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ లీడర్లు ఒకే జైలుకు వెళ్లినా.. అక్కడ మాత్రం వారికి కలిసే ఛాన్స్ లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది కదూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: