తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణమంత్రిగా రాజ్‌నాథ్‌ రికార్డు సృష్టించారు. తేజస్‌ దాదాపు ధ్వని వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. సార్టీ మాక్ వన్ రేంజ్‌ను అందుకున్నారు. అంటే గంటకు  1235 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉంటారని అంచనా. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ ఎయిర్‌పోర్టుకు  చేరుకున్న రాజ్‌నాథ్‌.. జీ-సూట్‌, హెల్మెట్‌, ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి తేజస్‌లోకి ఎక్కారు. పైలట్‌ వెనుక కూర్చుని ప్రయాణించారు. మధ్యలో ఓసారి యుద్ధవిమానాన్ని నియంత్రించారు కూడా.  పైలట్‌ చెబుతుండగా దాదాపు 2 నిమిషాల పాటు రాజ్‌నాథ్‌ తేజస్‌ను నియంత్రిస్తూ నడిపారని డీఆర్‌డీవో చీఫ్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. 


తేజస్‌ యుద్ధ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలో చేర్చింది. ఈ విమానానికి సంబంధించిన నౌకాదళ వెర్షన్‌ గతవారం కీలక పరీక్ష పూర్తిచేసుకుంది. అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ అనే  ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా విమాన వాహక నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇలాంటి యుద్ధవిమానాన్ని రూపొందించే సత్తా కలిగిన అతికొద్ది దేశాల  సరసన భారత్‌ చేరింది.


ఇక...తేజస్‌లో ప్రయాణించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్. తాను స్వయంగా నడిపిన రెండు నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన తెలిపారు.  చాలా స్మూత్‌గా...కంఫర్టబుల్‌గా ప్రయాణం సాగినట్లు చెప్పారు. తేజస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేశానని అన్నారు. హెచ్‌ఏఎల్...డీఆర్‌డీఓ ఇతర ఏజెన్సీలకు రక్షణమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలకు ఫైటర్ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మొత్తానికి రక్షణ శాఖ మంత్రి తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లో ప్రయాణించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: