చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటూ ఆయనకు ఏదో అయ్యిందనే అనుమానం వస్తోంది. ఫర్నీచర్ విషయంలో  అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు చేసిన తప్పు ఏంటని ఎదురు  ప్రశ్నిస్తున్నారు.  కోడెల దగ్గరున్న ఫర్నీచర్ ను దొంగ సొత్తుగా ఎలా చిత్రీకరిస్తారంటూ వితండ వాదం మొదలుపెట్టారు. నిన్నటి వరకూ ఓ 2 లక్షల రూపాయల ఫర్నీచర్ దగ్గరుంచుకున్నందుకే తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెడతారా ? అంటూ ప్రశ్నించింది ఇదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.

 

అంతకన్నా విచిత్రమైన వాదన ఏమిటంటే కోడెల దగ్గరున్నది దొంగ సొత్తే అయితే సిఎం, మంత్రుల దగ్గరున్నది కూడా దొంగసొత్తేనా ? అంటూ వాదించటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు వాదన వింటుంటే ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. ఇటువంటి చవకబారు ఆలోచనలున్న మనిషి, అడ్డుగోలు వాదనలు చేసే చంద్రబాబు అసలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎలా అయ్యాడా ? అనే అనుమానం వస్తోంది.

 

అసెంబ్లీ ఫర్నీచర్ ను తాను వాడుకున్నట్లు స్వయంగా కోడెలే మీడియా సమావేశంలో అంగీకరించిన విషయం చంద్రబాబుకు తెలీదా ? అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ కొడుకు శివరామకృష్ణ షోరూములో ఎలా ఉందన్న ప్రశ్నకు కోడెల కూడా సమాధానం చెప్పలేకపోయారు. తన తప్పును కోడెలే అంగీకరించినపుడు కానీ, అసెంబ్లీ ఫర్నీచర్ కొడుకు షోరూములో దొరికినపుడు ఈ పెద్దమనిషి అసలు నోరే మెదపలేదు.

 

తాను కోడెలకు మద్దతుగా మాట్లాడకపోవటమే కాకుండా నేతలెవరిని కూడా నోరిప్పనీయలేదు. పైగా చట్ట ప్రకారం కోడెలపై ఎటువంటి చర్య తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పిన విషయం మరచిపోయినట్లున్నారు. అదే సమయంలో కోడెల చెప్పింది ముమ్మాటికి తప్పే అంటూ వర్ల రామయ్య లాంటి వాళ్ళతో చెప్పించిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంది. ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే చంద్రబాబుకు ఏమో అయ్యిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: