ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో తీసుకున్న నిర్ణ‌యం విష‌యంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఖుష్ చేశారు.  ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కేసీఆర్ ఆప్తుడికి చోటిచ్చారు.  బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు ప్రముఖులకు అవకాశం లభించగా... కేసీఆర్ బంధువు దీవకొండ దామోదర్‌రావుకు చోటు ద‌క్కింది.


మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన జాబితాతో ఉత్తర్వులు జారీచేసింది.  ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి (ఎండోమెంట్), దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ ఈవో ఉంటారు. బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు ప్రముఖులకు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి ఏపీ సర్కారు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వీ ప్రశాంతి, ఎమ్మెల్యేలు యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, మల్లికార్జున్‌రెడ్డి, కే పార్థసారథి, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనిత, చిప్పగారి ప్రసాద్‌కుమార్‌కు అవకాశం కల్పించింది. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపు, కుమారగురు.. ఢిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేశ్‌శర్మ, కర్ణాటక నుంచి రమేశ్‌శెట్టి, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తికి అవకాశం కల్పించారు.


తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తొలినాళ్ల నుంచి ఉద్యమనాయకుడు కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో ధీవ‌కొండ దామోద‌ర రావు ఒకరు. 2001 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల స్థాపనలో ఆయనది ప్రధాన భూమిక. తెలంగాణకు సొంత మీడియా సంస్థలు ఉండాలని నాటి ఉద్యమనేత కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా రెండు మీడియా సంస్థలను నెలకొల్పడంలో దామోదర్‌రావు తన సహకారం అందించారు. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ (టీ-న్యూస్ చానల్)కు తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన దామోదర్‌రావు.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ పబ్లికేషన్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ తలచిన వెంటనే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ పబ్లికేషన్స్ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: