దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో ఉద్దీపనలకు తెరతీసిన మోదీ సర్కారు.. అమ్మకాలు లేక మందగమనంలో చిక్కుకున్న టెలివిజన్ తయారీ రంగానికీ చేయూతనిచ్చింది. ఇందులో భాగంగానే ఓపెన్ సెల్ టీవీ ప్యానెల్‌పై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం స్థానిక టీవీ తయారీదారులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూర్చనున్నది. అలాగే తగ్గుతున్న టీవీ ఉత్పాదక వ్యయం.. అటు వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకూ పెద్ద ఎత్తున లాభించనున్నది. లిక్విఫైడ్ క్రిస్టల్ డిస్‌ప్లే (ఎల్‌సీడీ), లైట్ ఎమిట్టింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే ఓపెన్ సెల్ (15.6 అంగుళాలు, అంతకంటే ఎక్కువ)పై దిగుమతి సుంకాన్ని తొలగిస్తున్నాం అని మంగళవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


భారీ టెలివిజన్ సెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంపు, మార్కెట్‌లో పెరిగిన పోటీ, మందగమన పరిస్థితుల కారణంగా దేశంలో టీవీలకు డిమాండ్ సన్నగిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం రద్దు వల్ల ఉత్పాదక వ్యయం చెప్పుకోదగ్గ స్థాయిలోనే దిగివస్తున్నదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం పరిశ్రమకు ఎంతగానో లాభమని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే పండుగ సీజన్‌కు ముందు మార్కెట్‌లో టెలివిజన్ అమ్మకాలకు ఊతమిచ్చే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెలివిజన్ల తయారీ, ముఖ్యంగా ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల ఉత్పత్తిలో సగానికిపైగా విలువైన ఓపెన్ సెల్ ప్యానెళ్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయడం.. ధరలను గణనీయంగా తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే టీవీల అమ్మకాలు ఈసారి విపరీతంగా జరుగడం ఖాయమన్న అంచనాలను వారు వ్యక్తం చేస్తున్నారు. పండుగ ఆఫర్లకుతోడు ఈ ధరల తగ్గింపు కస్టమర్లను కొనుగోళ్ల వైపునకు మళ్లిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు. దేశంలో టెలివిజన్ తయారీ పరిశ్రమ బలపడుతుందంటూ తాజా నిర్ణయాన్ని టీవీ ఉత్పాదక రంగం స్వాగతించింది.


ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, సోనీ ఇండియా, హైయర్ ఇండియా సంస్థల అధిపతులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాకు మద్దతునిచ్చిందని అభిప్రాయపడ్డారు.  ఈ సుంకం వల్లే సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గతేడాది తమ తయారీ కేంద్రాన్ని భారత్ నుంచి వియత్నాంకు తరలిచింది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. మళ్లీ విదేశీ టెలివిజన్ తయారీ దిగ్గజాలను భారత్‌కు రప్పించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. 32 అంగుళాలు, అంతకంటే ఎక్కువ శ్రేణి టెలివిజన్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. పరిశ్రమకు మరింత మేలు చేసినవారవుతారని శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: