జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చెప్పుకుంటున్న గ్రామ సచివాలయాల రాత పరీక్షలపై లీకేజీ మరకలు పడ్డాయి.  గ్రామ సచివాలయాల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను  గురువారం సచివాలయంలో జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ పోస్టుల భర్తీని జగన్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజిగా తీసుకుంది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకేసారి సుమారు 4 లక్షల గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పోస్టులను భర్తీ చేయటం తమ రికార్డుగా జగన్ చాలాసార్లు చెప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్ల ఎంపికను ఎటువంటి వివాదం లేకుండానే పూర్తి చేసిన ప్రభుత్వం గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణపైన మాత్రం వివాదాలు మొదలైంది.

 

గ్రామ సచివాలయం పరీక్షలకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచే మీడియా బల్లగుద్ది చెబుతోంది. ఏపిపిఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షల ప్రశ్నపత్రం అందులో పనిచేసే ఉద్యోగుల ద్వారానే లీకయినట్లు చెప్పింది. తన కథనానికి కొన్ని ఆధారాలను కూడా చూపిస్తోంది. కమీషన్లో పనిచేసే అధికారుల బంధువులకు మంచి ర్యాంకులు రావటమే తన కథనానికి ఆధారాలంటూ చెప్పటం గమనార్హం.

 

పైగా పరీక్షకు సిద్ధం చేసిన ప్రశ్నపత్రాన్ని కమీషన్లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని టైపు చేసిందని కూడా కథనంలో ఇచ్చింది.  ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారిలో అత్యధికులు కమీషన్లో పనిచేసే ఉద్యోగులు, వారి బంధువులే నిలవటంతో ఆ కథనానికి మద్దతిస్తోంది. కమీషన్లో పనిచేసే అధికారి భార్యతో పాటు ఆ అధికారి కుటుంబ సభ్యులకు మంచి ర్యాంకులు రావటం కూడా అనుమానాలకు తావిస్తోంది.

 

ప్రశ్నపత్రం లీకయ్యిందనే కథనం బయటకు వచ్చింది కాబట్టి దీనిపై విచారణ చేయిస్తేనే జగన్ ప్రభుత్వం ప్రతిష్ట నిలుస్తుంది. ఒకవేళ లీకేజి నిజమే అని తేలితే మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందనటంలో సందేహం లేదు. మళ్ళీ పరీక్షలు రాయాలంటే లక్షలాది మందికి కష్టమే అయినా తప్పు జరిగినపుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవటంలో తప్పేలేదు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: