స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని సాధారణంగా వినియోగిస్తూనే ఉంటాం. కానీ ఇప్పటివరకు గూగుల్ అసిస్టెంట్ ప్రాంతీయ భాషలలో అందుబాటులో లేదు. ప్రాంతీయ భాషలు మాత్రమే తెలిసినవారు గూగుల్ అసిస్టెంట్ ను వినియోగించలేకపోతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ 9 ప్రాంతీయ భాషలలో గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించుకొనే విధంగా మార్పులు చేసింది. 
 
నిన్న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఈ కొత్త అప్ డేట్ కు సంబంధించిన వివరాలను ప్రకటించటం జరిగింది. ఈ కొత్త అప్ డేట్ వలన ఇకనుండి తెలుగులో కూడా గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త సదుపాయం వలన గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లకు ప్రాంతీయ భాషల్లో ఆదేశాలను ఇవ్వవచ్చు. 
 
మనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు పని చేయటం జరుగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, బెంగాళీ, కన్నడ భాషలకు ఈ సదుపాయాన్ని కల్పించినట్లు సమాచారం. గూగుల్ యాప్ ను అప్ డేట్ చేసుకోవటం ద్వారా ఈ కొత్త సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం హిందీతో పాటు ఇతర భాషల్లో గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నా ఓ ఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. 
 
గూగుల్ యాప్ అప్ డేట్ చేసుకున్న తరువాత భాషను సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త సదుపాయం వలన సొంత భాషలో మరింత సులభంగా వినియోగదారులు గూగుల్ అసిస్టెంట్ ను వినియోగించుకొనే అవకాశం ఉందని గూగుల్ భావిస్తుంది. గూగుల్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు మాట్లాడేవారి మధ్య ట్రాన్స్ లేటర్ గా ఉపయోగపడే ఇంటర్ ప్రిటర్ మోడ్ కూడా కొన్ని నెలల్లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భవిష్యత్తులో గూగుల్ వాయిస్ కమాండ్ల ద్వారా బస్ టికెట్లు బుక్ చేయటం, ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేయటం వంటి సదుపాయాల్ని కల్పించబోతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: