తెలంగాణ కాంగ్రెస్ లో  మళ్లీ ఆధిపత్యపోరు రాజుకుందా? అంటే తాజాగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు పరిశీలిస్తే అవుననే సమాధానం విన్పిస్తోంది . పార్టీ తరుపున గెల్చిన 12 మంది ఎమ్మెల్యేలు,  అధికార టీఆరెస్ లో చేరిన తరువాత తెలంగాణలో చావు దెబ్బ తిన్నట్లు కనిపించిన కాంగ్రెస్ పార్టీ లో , అంతర్గత కుమ్ములాటలు ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు.  టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,  ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  రేవంత్ వ్యాఖ్యలకు ఉత్తమ్ కాకుండా భువనగిరి ఎంపీ  కోమట్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది .


 శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లుగా రేవంత్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్నర్ చేసినట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  గతంలో ఉత్తమ్... కోమటిరెడ్డి లు ఉప్పు , నిప్పు  అన్నట్లు  వ్యవహరించేవారు.  అయితే హుజూర్ నగర్  ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్  పద్మావతి ని ఏకపక్షంగా   ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపడుతూ,  కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్ కుంతియా కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురి చేసింది .   హుజూర్ నగర్  నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా,  ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గ పరిధిలో హుజూర్ నగర్ అంతర్భాగంగా వుంది.


 అయితే మల్కాజ్ గిరి  ఎంపీ గా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ కు హుజూర్ నగర్  అభ్యర్థి ఎంపిక పట్ల అభ్యంతరం ఎందుకన్న వాదనలు కాంగ్రెస్ వర్గాల్లో  లేకపోలేదు.  దానికి తోడు తమ  సొంత జిల్లాలో రేవంత్ జోక్యం ఏమిటి  అంటూ  కోమటిరెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తున్నారు . కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రేవంత్ ఆత్మరక్షణ లో పడినట్లు కన్పిస్తున్నారు . సొంత జిల్లా కాదు .. తన నియోజకవర్గ  పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కాకపోవడం తో ఆయన ఈ అంశం పై అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు విన్పిస్తున్నాయి .


టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ ను విమర్శించిన… రేవంత్ ను కార్నర్ చేయడం ద్వారా కోమటిరెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు . ప్రస్తుత ఎపిసోడ్ లో ఉత్తమ్ కు దన్నుగా  నిలవడం ద్వారా , భవిష్యత్తు లో  టీ పిసిసి అధ్యక్ష పదవికి తన  పేరును ఆయన కూడా ప్రతిపాదించే అవకాశాలు లేకపోలేదని  కోమటిరెడ్డి అంచనా వేసి ఉంటారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: