ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి మహానగరం కాబోతోంది. స్మార్ట్ సీటిగా అభివృద్ది చెందుతున్న నగరాన్ని మరింత అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు. గతంలో ఉన్న ప్రతిపాదనలు పక్కన పెట్టి కొత్తగా సమీప పంచాయతీలను విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 


వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో తిరుపతి ఒకటి. ఆధ్యాత్మికంగానే కాదు.. విద్య, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించి అభివృద్ధికి చేయూతనిచ్చింది. అయినా నగర విస్తరణకు అవకాశాలు తక్కువే. ఇరుకుగా మారిన తిరుపతిలో రోడ్లు విస్తరించడం ఇతర వసతులు కల్పించడం అసాధ్యం. ఇందుకు నగర పరిధి విస్తరణ అనివార్యం. 2013 జులైలో మూడు పంచాయతీల విలీనంతో నగరపాలక సంస్థ తొలిసారి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. తాజాగా నగరాన్ని ఆనుకుని ఉన్న 10 పంచాయతీలను విలీనం చేయడం ద్వారా గ్రేటర్‌ తిరుపతికి కసరత్తు ప్రారంభించారు. 


ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి దివ్య దర్శనం కోసం రోజు వేలసంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో పెద్దపల్లెగా ఉన్న తిరుపతి కాస్త నగర స్థాయికి ఎదిగింది. నగర జనాభా సుమారుగా నాలుగున్నర లక్షలకు చేరువలో ఉంది. తిరుపతి విస్తీర్ణం  16 చదరపు కిలోమీటర్లు ఉంటే, నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య రెండు లక్షలకు పై మాటే. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి నగర జనాభా 3 లక్షల 74 వేలు.. ప్రస్తుత జనాభా 4 లక్షల 26 వేలు. పట్టణీకరణతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి. తిరుపతి నగరపాలిక సరిహద్దుల్లోని ఐదారు కి.మీలు ఇప్పటికే నగరవాసులతో నిండిపోయింది.  రానున్న రోజుల్లో యాత్రికుల సంఖ్య లక్షన్నరకు చేరడం తప్పనిసరని తెలుస్తోంది.  


పారిశ్రామికాభివృద్ధి అంతా తిరుపతి- రేణిగుంట మార్గం, రేణిగుంట పరిసరాలకే పరిమితం అయింది. తుడా ఆధ్వర్యంలో త్వరలో సూరప్పకశం, శెట్టిపల్లె టౌన్‌షిప్‌లు అభివృద్ధికి ఆస్కారం ఉంది. తిరుచానూరు, శెట్టిపల్లె, తుమ్ములగుంట, సాయి నగర్, పద్మావతి పురం, అవిలాల, మల్లం గుంట, వేదాంతపురం, రామనుజపల్లె, చిగుర వాడ లాంటి పది పంచాయతీలను విలీనం చేయడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్దం చేసినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే మరి కోద్ది రోజుల్లో తిరుపతి మహానగరం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: