ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభంకానుంది . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకూ ఈ పథకం వర్తిస్తుంది.  


అక్టోబర్ నెల 15 నుంచి వైయస్ఆర్ రైతు భరోసా పథకం ఏపీలో అమలు కానుంది. 201920కి రబీ నుంచి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం...ఈ పథకం కింద రైతులు, కౌలు రైతులకు  12 వేల 500 రూపాయలు సాయం అందజేయనుంది.  రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ కింద ఇచ్చే  6వేల రూపాయలు ఇందులోనే కలిసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు  ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపన్ను కట్టే రైతులకు ఈ పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. 


వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతులతో పాటు ఓసీలు మినహా కౌలు రైతులు ఈ పథకానికి ఆర్హులు అవుతారు. ఐదు ఎకరాలకు మించి పొలం ఉన్నవారికి రైతు భరోసా పథకం వర్తించదు. ప్రభుత్వంలోని గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు, 10 వేల రూపాయల కంటే తక్కువ పింఛన్ తీసుకునే వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది.  అర ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు ఉద్యానవన తోటలు, ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు వ్యవసాయ పంటలు సాగు చేసే వారికి ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతులకు కూడా ఇవే నిబంధనలు వరిస్తాయి. కొన్ని జిల్లాల్లో  ఇప్పటికే  సర్వే ప్రారంభించినట్టు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులు గ్రామ రెవెన్యూ అధికారి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత అర్హుల జాబితాను విడుదల చేయటం జరుగుతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: