జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రంలో మీడియా భయపడిపోతోందని చంద్రబాబునాయుడు తేల్చేశారు. జగన్ చేస్తున్న టెర్రరిజంలో  మీడియా  కూడా భాగమైపోయిందన్నారు. మీడియాను జగన్ భయపెట్టి తనకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో మీడియా భయపడిపోయింది కాబట్టే జాతీయ మీడియా జగన్ ప్రభుత్వంలో తప్పుల గురించి చెప్పిందట.

 

నిజానికి చంద్రబాబు చెప్పినట్లుగా  జగన్  అంటే మీడియా  భయపడుతున్నదే కరెక్టయితే  ఎల్లోమీడియాలో ప్రతి రోజు జగన్ కు వ్యతిరేకంగా కథనాలు, వార్తలు ఎలా అచ్చేస్తున్నారు ?  మూడు నెలల పాలనలో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాల రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి,  మహిళలు,  కాపులకు నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్, శాస్వత బిసి కమీషన్  లాంటి అనేక  మంచి నిర్ణయాలు కూడా ఉన్నాయి.

 

అయితే మంచి నిర్ణయాల గురించి ఎక్కడా పొరబాటుగా కూడా తమ పత్రికల్లో  ప్రస్తావన రాకుండా  ఇసుక నిషేధం, అన్న క్యాంటిన్ల రద్దు లాంటి తాత్కాలిక నిర్ణయాలపై మాత్రం పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారంటేనే మీడియా స్వేచ్చ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. ఇక ఏమీ లేకపోయినా చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు చేసిన రచ్చకు ఎల్లోమీడియా ఏ స్ధాయిలో ప్రాధాన్యత ఇచ్చిందో అందరూ చూసిందే.

 

తాజాగా కోడెల ఆత్మహత్య ఘటనలో చంద్రబాబు, టిడిపి నేతల వాదనలకు మద్దతుగా ఏ స్ధాయిలో ప్రచారం ఇచ్చారో అందరు చూసిందే. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంతంగా కథనాలు కూడా అచ్చేశారు కదా ? ఇవన్నీ రాష్ట్రంలో మీడియా స్వేచ్చ లేకుండానే జరిగాయా ?  రాష్ట్రంలోని మీడియా సంస్ధల్లో ఇప్పటికీ 80 శాతం యాజమాన్యాలు చంద్రబాబుకు మద్దతుగానే పని చేస్తున్నాయన్న విషయం అందరకీ తెలిసిందే.

 

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి గెలిపించాలన్న ఏకైక ధ్యేయంతో మీడియా ఎలా పనిచేసింది అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు కూడా మీడియా స్వేచ్చ గురించి, మీడియాను భయపెట్టటం గురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: