ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు.. రక్తసంబంధం అలాంటిది.. అయినవాళ్ల కష్టం.. మన కళ్లలో కన్నీరు పలుకుతుందని ఆ లేడీ ఎమ్మెల్యే మరోసారి రుజువు చేశారు. అందులోనూ ఆప్తుల మరణం ఎంతటి వారికైనా ఎప్పటికీ తీరని లోటే.. ఇందుకు తెలంగాణ అసెంబ్లీలో ఓ మహిళా ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్న తీరే నిదర్శనంగా నిలుస్తోంది.

కిడ్నీ వ్యాధిగ్రస్తుల సాధక బాధకాలను అసెంబ్లీలో వివరిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునీత అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె డయాలిసిస్ పై ప్రశ్న వేశారు. ఈ సందర్భంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో తన తండ్రి మరణించారని గుర్తు చేసుకుని సునీత ఏడ్చేశారు.

డయాలసిస్ పేషెంట్ల దీనస్థితిని ఎమ్మెల్యే సునీత తోటి సభ్యులకు వివరించారు. కిడ్నీ వ్యాధుల బారిన పడి, డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తే.. ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఆమె చెప్పిన తీరు అందర్నీ ఆలోచింపజేసింది. ఆమె ఏమన్నారో.. ఆమె మాటల్లోనే చూద్దాం..

‘‘ఇంటి పెద్ద డయాలసిస్ పెషెంట్ అయితే కుటుంబం ఉపాధి కోల్పోతుంది. అతడితో పాటు ఆ కుటుంబం కూడా చాలా బాధలు పడాల్సి వస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది మగవారే ఉంటారు. దీంతో సంపాదనతో కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి కిడ్నీ వ్యాధి బారిన పడితే ఆ కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. భార్య అతడికి సేవ చేస్తూ, నిత్యం అతడి వెంటే ఉండటంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోతుంది. మానసికంగానూ ఇబ్బంది పడుతుంది.

మా నాన్న 14 ఏళ్లు డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో చితికిపోయాం. ఆ బాధేంటో నాకు తెలుసు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉంది. దీంతో కిడ్నీలు పాడవటం అనే సమస్య ఎక్కువగా ఉంది.. కొలనుపాకలో 24 ఏళ్ల ఓ యువకుడు కిడ్నీలు ఫెయిలై డయాలసిస్ కోసం వారంలో రెండుసార్లు హైదరాబాద్‌కు తిరుగుతున్నాడు.. ఓ అర్చకుడి కుటుంబంలో 19 ఏళ్ల కొడుకు రెండు కిడ్నీలు చెడిపోయి చనిపోయాడు.. “

ఇలా డయాలసిస్ బాధితుల కష్టాలను వివరించే క్రమంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్యేకించి తండ్రి గురించి చెప్పే సమయంలో ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండటంతో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు ఇస్తున్నట్టుగానే డయాలసిస్ చేయించుకునే పేషెంట్లకు కూడా ఆసరా పింఛన్లు అందించాలని సునీత కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: