చిత్తూరు మాజీ ఎంపీ టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలం నుండి శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివప్రసాద్ మృతి చెందారు. సమస్య తీవ్రం కావటంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. 
 
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం శివప్రసాద్ ఓడిపోయారు. ప్రత్యేకహోదా ఉద్యమంలో శివప్రసాద్ తనదైన ప్రత్యేకశైలిలో ఆకట్టుకున్నారు. సినీ రంగంలోను శివప్రసాద్ తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. 
 
ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శివ ప్రసాద్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో శివప్రసాద్ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు పార్లమెంటులోను  ఎంపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తన వాణిని శివప్రసాద్ బలంగా వినిపించారు. 
 
జాతీయ మీడియా దృష్టిని కూడా ఒక దశలో శివప్రసాద్ ఆకర్షించారు. శివ ప్రసాద్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో సినిమాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు. శివప్రసాద్ 1951 జులై 11వ తేదీన చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మస్కా, ద్రోణ, ఒక్క మగాడు, తకిట తకిట, లక్ష్మి, బలాదూర్, నరేష్ యముడికి మొగుడు, అయ్యారే మొదలగు సినిమాల్లో శివప్రసాద్ నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: