తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మందు కొట్టి మాట్లాడుతున్నారా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. దేవీపట్నం ఎస్సై వద్దని వారించినా కలెక్టర్, ఎస్పీకి అవంతి ఫోన్ చేయటంతో బోటు కదిలిందని హర్షకుమార్ ఆరోపణలు చేశారు. టూరిజం బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని  విమర్శించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫోటోలు, సెల్ ఫోన్ బయటపెట్టాలని కోరారు. 
 
బోటును వెలికితీయటం అధికారులకు ఇష్టం లేదని హర్షకుమార్ అన్నారు. దేవీపట్నం  ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "వైయస్ రాజశేఖరరెడ్డి గల్లంతు అయిన సమయంలో బాధేంటో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. బోటు బాధితుల బాధను కూడా ముఖ్యమంత్రి జగన్ అర్థం చేసుకోవాలి. పుష్కరాల్లో 28 మంది చనిపోయిన సమయంలో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు బోటు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు" అని హర్ష కుమార్ ప్రశ్నించారు. 
 
గోదావరి బోటు ప్రమాదంలో 73 మంది ప్రయాణం చేయగా అందులో 26 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 47 మందిలో 34 మంది మాత్రమే విగత జీవులుగా దొరికారు. ఇంకా 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మిగతా 13 మంది ఆచూకీ కూడా లభిస్తే బోటును బయటకు తీయాల్సిన అవసరం కూడా లేదు. బోటులో ఎవరైనా చిక్కుకొని ఉంటారేమోననే అనుమానంతో బోటును బయటకు తీయాలన్న ఆలోచన చేస్తున్నారు. 
 
ఈ బోటును బయటకు తీయటానికి అధికారులకు ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోటును నిపుణులు గుర్తించినప్పటికీ దానిని బయటకు తీయటం గురించి మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ బోటును ఎలా తీయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బోటును ఖచ్చితంగా గుర్తించగలిగితే అందులో ఎవరైనా చిక్కుకున్నారా గుర్తించి, వారిని బయటకు తీయటానికి అనుభవం ఉన్న డ్రైవర్లను కూడా పంపే మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: