ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీకైన నేపథ్యంలో.. తెలుగుదేశం విద్యార్థి విభాగం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించింది. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రశ్నాపత్రం లీకైందని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల పోస్టుల కోసం  రేయింబవళ్లు నిద్రాహారాలు మాని చదివిన లక్షలాది మంది నిరుద్యోగులంతా.. ఏపీపీఎస్సి పేపర్‌ లీక్‌ చేసిందని పత్రికల్లో వచ్చిన కథనాలతో నిరుత్సాహానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తమది పారదర్శకమైన ప్రభుత్వమని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి.. పేపర్‌ లీకేజీకి పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మూడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. వాలంటరీలందరిని స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన వారినే నియమించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 


చివరకు సచివాలయ ఉద్యోగుల పేపర్‌ సైతం లీకైన నేపథ్యంలో పారదర్శకత ఎక్కడుందని  ప్రభుత్వాన్ని నిలదీశారు. వైకాపా ప్రభుత్వం పారదర్శకత అనే పదానికి అర్థాన్ని మార్చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని.. పరీక్ష విధానంపైన సిట్టింగ్‌ జడ్జితో విచారణ నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


ఏపీపీఎస్సీని ముట్టడించిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరితో సహా నాయకులందరినీ పోలీసుల అరెస్ట్‌ చేసి రాజ్‌ భవన్‌ సమీపంలోని సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు వినోద్‌, సామినేని మధు, కొంగరా నరేంద్ర, రామబ్రహ్మం, సత్యదేవ మరియు పెద్ద మొత్తంలో విద్యార్థులు, పరీక్ష రాసిన అభ్యర్థులు వారి బంధువులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: